బెయిల్‌పై విజయసాయి రెడ్డి విడుదల

 బెయిల్‌పై విజయసాయి రెడ్డి విడుదల

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయనకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టులను తమకు అప్పగించాలని కోర్టు విజయ సాయిరెడ్డిని ఆదేశించింది.

హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు ఆయనకు షరతు విధించింది. అదే విధంగా ఇద్దరు వ్యక్తులతో రూ. 25 వేల రూపాయలేసి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డిని సిబిఐ జనవరి 2వ తేదీన అరెస్టు చేసింది. జగన్ ఆస్తుల కేసులో అరెస్టయింది ఆయన ఒక్కరే. ఆయనపై సిబిఐ కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. విజయసాయి రెడ్డిని వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడిగా చేర్చింది. 

విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేయకూడదని సిబిఐ కోర్టులో గట్టిగా వాదించింది. విజయసాయి రెడ్డి బెయిల్ అమలును ఈ నెల 16వ తేదీ వరకు నిలిపేయాలని సిబిఐ కోర్టును కోరింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో కీలక సూత్రధారి విజయసాయి రెడ్డేనని సిబిఐ వాదిస్తూ వస్తోంది. వివిధ కంపెనీల నుంచి వైయస్ జగన్ సంస్థల్లోకి నిధుల మళ్లింపులో విజయసాయి రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించారని సిబిఐ ఆరోపించింది. విజయసాయి రెడ్డి ఇంతకు ముందు రెండుసార్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే అప్పుడు కోర్టు బెయిల్‌కు నిరాకరించింది. 

కాగా, విజయసాయి రెడ్డి అక్రమమంటూ ఆయన తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వాదించారు. వైయస్ జగన్ కుటుంబానికి విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్, ఆర్థిక సలహాదారు మాత్రమేనని, లావాదేవీలతో ఆయనకు సంబంధం లేదని సుశీల్ కుమార్ వాదించారు. విజయసాయి రెడ్డిని రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని ఆయన అన్నారు. విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సిబిఐ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితుడు బిపి ఆచార్య విషయంలో సిబిఐ అదే పని చేసింది.

బెయిల్ లభించడంతో విజయసాయి రెడ్డి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని చంచల్‌గుడా జైలు నుంచి విడుదలయ్యారు. చంచల్‌గుడా జైలు వద్ద పెద్ద యెత్తున మీడియా మోహరించింది. ఆయనతో మాట్లాడించడానికి తీవ్రంగానే ప్రయత్నించింది. అయితే ఏమీ మాట్లాడుకుండా కారులో కూర్చుని వెళ్లిపోయారు.