కుప్పకూలిన విమానం

కుప్పకూలిన విమానం

 పాకిస్తాన్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ సమీపంలో ప్రయాణికులతో కూడిన విమానం కుప్పకూలింది. ఆ విమానం కోరల్ చౌక్ అనే గ్రామంలో కూలినట్లు పాకిస్తాన్ టెలివిజన్ చానెల్స్ తెలుపుతున్నాయి. విమానంలో దాదాపు 127 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారంతా మరణించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిలో 118 మంది ప్రయాణికులు కాగా, తొమ్మిది మంది విమాన సిబ్బంది. 

భోజ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీ నుంచి బయలుదేరి ఇస్లామాబాద్‌కు వస్తోంది. ఆ సమయంలో ప్రతికూల వాతావరణం వల్ల విమానం కూలినట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదంతో 15 ఇళ్ల దాకా దగ్దమైనట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు చెబుతున్నారు. విమానం కూలిన విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. 

విమానం సాయంత్రం ఏడు గంటలకు ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉండింది. ప్రయాణికులంతా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. విమానం పూర్తిగా శిథిలమైనట్లు తెలుస్తోంది. సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుంది. విమానాశ్రయానికి పది కిలోమీటర్ల దూరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో విమానం కూలింది. విమానం మండుతున్న బంతిలాగా వచ్చి పడిందని అంటున్నారు. కూలడానికి ముందే విమానంలో మంటలు లేచినట్లు చెబుతున్నారు. ఇస్లామాబాద్‌లోని అన్ని ఆస్పత్రులను, రావల్పిండిలోని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.