కెసిఆర్ వ్యాఖ్యలపై బొత్స

కెసిఆర్ వ్యాఖ్యలపై బొత్స

 తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెసుతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు వార్తా కథనాలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం స్పందించారు. కెసిఆర్‌ది సింగిల్ పాయింట్ అజెండా అని, తెలంగాణ ఏర్పాటే ఆయన లక్ష్యమని బొత్స అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌తో ఆయన తప్పకుండా కలసి వస్తారని, దానివల్ల కాంగ్రెస్‌కు కూడా లాభిస్తుందన్నారు. రాజకీయంగా కెసిఆర్ ఆలోచన మంచిదేనని, తాము కూడా కలుస్తామని చెప్పారు. తెలంగాణ సున్నితమైన అంశమని అన్నారు. సమైక్యం అయినా, విభజన అయినా పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటుందే తప్ప గెలుపోటములు, రాజకీయ లబ్ధి కోసం ఆశించదన్నారు.

తెలంగాణపై జరిగిన చర్చ వివరాలను బయటకు వెల్లడించలేనని, ఈ అంశంపై తమకు ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పారు. శాశ్వత పరిష్కారం కోసం అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. తెలుగుదేశం లాంటి పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం దురదృష్టకర పరిణామం అన్నారు. 

టిడిపి తన వైఖరి చెప్పినా, చెప్పకపోయినా సమయం వచ్చినప్పుడు తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో కూడా టిడిపి మూడో స్థానంలోనే నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డ్రామాల పార్టీ అంటూ హరికృష్ణ వ్యాఖ్యానిస్తున్నారని, తానెప్పుడూ డ్రామాలు వేయలేదని, ముఖానికి మేకప్ వేసుకోలేదని, సినిమాల్లో నటించలేదని, సినిమాలు కూడా తీయలేదని పరోక్షంగా ఆయనను విమర్శించారు.