గబ్బర్ సింగ్ ఫంక్షన్‌లో చేర్రీ ఫోకస్

గబ్బర్ సింగ్ ఫంక్షన్‌లో చేర్రీ ఫోకస్

రామ్ చరణ్ తేజ నిన్న(ఆదివారం)రాత్రి జరిగిన గబ్బర్ సింగ్ ఆడియో పంక్షన్ కి హాజరు కాలేదు. ఈ విషయం మళ్లీ గతంలో పవన్ తరహాలో మీడియాలో అల్లరి అవుతుందని ముందుగానే చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారు. తమ ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తూ మీడియాకు చురకలేసారు. అలాగే లేనిపోని వార్తలు సృష్టించి మా మెగా కుటుంబాన్ని దిగజార్చవద్దని సభాముఖంగా విన్నవించుకుంటున్నాను అని అన్నారు. దాంతో నిజానకి ఈ వార్తకి పెద్ద ప్రయారిటీ లేకపోయినా మీడియా దృష్టి మొత్తం రామ్ చరణ్ ఎందుకు రాలేదు అన్న మ్యాటర్ పై కేంద్రీకృతమైంది. 

చిరంజీవి మాటల్లోనే...'జంజీర్‌' షూటింగ్‌ కోసం చరణ్‌ ముంబైలో ఉన్నాడు. అందుకే ఈ కార్యక్రమానికి రాలేదు. 'చరణ్‌ ఉళ్లో ఉన్నాడు.. రాలేదు..' అని మీడియావాళ్లు ప్రచారం చేస్తారేమో? నిజంగా తను లేడు. 'రచ్చ' పాటల వేడుకకు పవన్‌ రాలేదు. రెండు రోజుల తరవాత ఓ కార్యక్రమంలో పవన్‌ కనిపిస్తే... కావాలనే రాలేదని వక్రీకరించారు. అబద్ధాలు చెప్పే స్థాయికి మెగా కుటుంబం దిగజారలేదు'' అన్నారు. 

పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గతంలో రచ్చ ఆడియోకి రాని విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ మాటల్లో..‘‘రచ్చ ఆడియో వేడుక జరిగినప్పుడు ‘పవన్‌కళ్యాణ్ విదేశాల్లో ఉన్నాడు. చరణ్‌కి బెస్ట్ విషెస్ చెప్పమన్నాడు' అని చెప్పాను. కానీ, ఆ తర్వాత రెండు, మూడు రోజులకు పూరి జగన్నాథ్‌కి సంబంధించిన ఫంక్షన్‌లో పవన్ కనిపిస్తే.. హైదరాబాద్‌లోనే ఉండి ‘రచ్చ' ఆడియో ఫంక్షన్‌కి రాలేదని వార్త సృష్టించారు. మాట తప్పడం మెగా కుటుంబం చరిత్రలో లేదు. పవన్‌కళ్యాణ్ ప్రయాణం చేసిన ఫ్లయిట్ టిక్కెట్, కస్టమ్స్ డాక్యుమెంట్స్ అన్నీ ‘రచ్చ' ఆడియో వేడుక తర్వాతి తేదీల్లో ఉన్నవే. ఇప్పుడు రామ్‌చరణ్ ‘జంజీర్' చిత్రం షూటింగ్ కోసం ముంబయ్‌లో ఉన్నాడు. బాబాయ్‌కి నా విషెస్ చెప్పండని నాతో అన్నాడు. దయచేసి ఈ మాటలను కూడా వక్రీకరించమాకండి అని ఉద్వేగంగా ప్రసంగించారు. 

ఇక పవన్‌కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన 'గబ్బర్‌సింగ్‌' పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆడియో కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం శిల్పకళావేదికలో నిర్వహించారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, పవన్‌కళ్యాణ్‌...తదితర సినీ నటులు హాజరయ్యారు. 'గబ్బర్‌సింగ్‌' చిత్ర ఆడియో వేడుక కార్యక్రమం వెరైటీగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు నగరాల్లోని దేవస్థానాల్ని సందర్శించి, చివరికి హైదరాబాద్‌లో ఆడియో రిలీజ్‌ చేసారు.