సిపిఎం వారిని పెళ్లి చేసుకోవద్దు

సిపిఎం వారిని పెళ్లి చేసుకోవద్దు

అధికారం అంది వచ్చాక తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమెతో పాటు ఆ పార్టీ నేతల తీరు విచిత్రంగా తయారయింది. విపక్షాలు అయితే దీదీకి, తృణమూల్ నేతలకు పిచ్చి పట్టినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మమతా బెనర్టీ వరుసగా ఇస్తున్న ఆదేశాలను చూసి అందరూ ఆశ్చర్యానికి, ఆందోళనకు లోనవుతున్నారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదని విమర్శిస్తున్నారు. తృణమూల్ వరుస ప్రకటనలు వివాదాస్పదమవుతున్నాయి.

వివాదాస్పద కార్టూన్లకు కారకుడైన ఓ ప్రొఫెసర్‌ను జైలుకు పంపిన దీదీ తాజాగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్‌పై పడింది. ఆమె ఫేస్ బుక్‌లో తమకు వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్లపై దృష్టి సారించింది. వాటిని తొలగించాలంటూ సిఐడి అధికారులు నిర్వాహకులకు లేఖ రాశారు. ఆ కార్టూన్లను ఏ ఐపి నుంచి పంపారో కూడా తెలియజేయాలని అడిగారు.

అందుకు వారు స్పందించి వివరాలు తెలియజేస్తే తదుపరి చర్యలు అందుకు సంబంధించిన వ్యక్తులపై ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మమత ప్రభుత్వంలోని ఓ మంత్రి వివాహాలపై వినూత్న ప్రకటన చేశారు. సిపిఎం నేతలను, కార్యకర్తలను, వారి కుటుంబాలలోని వ్యక్తులను పెళ్లాడవద్దని మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్ వింత సూచన చేశారు. ఇప్పటికే సిపిఎం కార్యకర్తలతో కుటుంబ సంబంధాలు ఉంటే తెంచుకోవాలని సూచించారు.

సిపిఎంను సాంఘికంగా బహిష్కరించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. సిపిఎంతో సంబంధాలు పెట్టుకుంటే పూర్తి స్థాయిలో పోరాడలేమని ఉద్భోద చేశారు. అంతేకాదు వారు బయట కనిపించినా మాట్లాడవద్దని చెప్పారు. టీ దుకాణంలో కనిపించినా మాట్లాడ వద్దన్నారు. అయితే ఓ మంత్రిగా ఉండి ఇలా వివక్షాపూరితంగా మాట్లాడటాన్ని ముక్తకంఠంతో అందరూ ఖండించారు. తృణమూలు నేతలకు పిచ్చి పట్టినట్లు ఉందని సిపిఎం నేతలు విమర్శిస్తున్నారు.

అంతకుముందు ఆంగ్ల మీడియాపై మమతా బెనర్జీ కన్నెర్ర జేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరూ కూడా అన్ని పేపర్లు చదవద్దని, తాము సూచించిన వాటిని మాత్రమే చదవాలని కొద్ది రోజుల క్రితం సూచించిన విషయం తెలిసిందే. కలం చేతిలో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించవద్దని, మీడియాలోని కొందరు ఇష్టారీతిన వార్తలు రాస్తున్నారని ఆమె మండిపడింది కూడా.