'జంజీర్'కు చెర్రీ రెమ్యునేషన్ ఎంత?

'జంజీర్'కు చెర్రీ రెమ్యునేషన్ ఎంత?

రామ్ చరణ్ తాజాగా హిందీలో జంజీర్ రీమేక్ తో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో భారతదేశ చరిత్రలో ఏ హీరోయిన్ అందుకోనంత పారితోషికాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అందుకోనుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నాలుగైదు కోట్లు ఇస్తేనే మహా గొప్పగా చెప్పుకునే బాలీవుడ్ పరిశ్రమలోనే తొమ్మిది కోట్లు పారితోషికం అనేసరికి అందరూ చుక్కలు లెక్కిస్తున్నారు. బాలీవుడ్‌లో కొత్త హీరోగా వస్తున్న రామ్‌చరణ్‌ను టార్గెట్‌గా చేసి మరీ నిర్మాతల దగ్గర ప్రియాంక ముక్కుపిండి తొమ్మిది కోట్లు వసూలుచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదో పెద్ద రికార్డని బాలీవుడ్ మీడియా చెప్పడం విశేషం. ఈ నేపధ్యంలో ఈ చిత్రంకోసం రామ్ చరణ్ ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారనే విషయం హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.

ఈ విషయమై రామ్ చరణ్ ని మీడియా ప్రశ్నిస్తే... సమాధానం ఇస్తూ... మా మేనేజర్ ఈ విషయాల్ని చూసుకుంటారు. నేను ఇలాంటి విషయాలను ఓపెన్ గా చర్చించలేను. ప్రియాంకతో నన్ను పోల్చవద్దు. ఆమె ఫ్యాషన్,డాన్ లో అద్బుతంగా నటించింది. ఆ నటన చూసి ఆమెతో కలిసి చేస్తున్నాం.ఇక నా హిందీ నేర్చుకునే విషయానికి వస్తే... ఓ ట్యూటర్ తో నేను హిందీ నేర్చుకునే పనిలో ఉన్నాను అన్నారు. అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా చేయనున్నారు. అగ్నిపధ్ లో సంజయ్ దత్ అదరకొట్టడంతో నెగిటివ్ పాత్రకు ఆయనైతేనే సరిపోతాడని భావిస్తున్నారు. ఇక రామ్ చరణ్ మాత్రం తన తాజా చిత్రం రచ్చ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఏప్రియల్ 5న విడుదల అవుతున్న ఆ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.

గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్‌ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్‌ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్‌ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్‌ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.