12న అధినాయకుడు

12న అధినాయకుడు

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మహాత్మాగాంధి... ఈ మహనీయుల మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. అదే ధర్మసంస్థాపన. వారిలాగే ఒకే లక్ష్యం, భిన్న మార్గాలు కలిగిన ముగ్గురు మహావ్యక్తుల కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అధినాయకుడు'. తాతగా, తండ్రిగా, తనయుడిగా బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో నిర్మాత ఎం.ఎల్.కుమార్‌చౌదరి తెలియజేశారు. 

ఇంకా ఆయన చెబుతూ- ‘‘బాలకృష్ణను దర్శకుడు పరుచూరి మురళి తెరపై ఆవిష్కరించిన విధానమే ఈ చిత్రానికి హైలైట్. ఇప్పటివరకూ కనిపించని కొత్త బాలయ్యను ఇందులో చూస్తారు. ఒక పాత్రకూ మరో పాత్రకూ పొంతన లేకుండా మూడు పాత్రలనూ అద్భుతంగా పోషించారు బాలకృష్ణ. ఇది తప్పకుండా జనం మెచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు. ‘‘బాలకృష్ణ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన కథ ఇది. ఆయన అభిమానులను రంజింపచేసే అన్ని అంశాలకు ఇందులో పెద్ద పీట వేశాం. 

బాలయ్య నటన, యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్, వినోదం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇటీవలే విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంటుందని నమ్మకంతో ఉన్నాం'' అని దర్శకుడు పరుచూరి మురళి అన్నారు. జయసుధ, లక్ష్మీరాయ్, సలోని, సుకన్య కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సంగీతం: కళ్యాణిమాలిక్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్, నిర్మాణం: శ్రీ కీర్తి కంబైన్స్.