అమలాపాల్ కి అవకాశాలేవి!

అమలాపాల్ కి అవకాశాలేవి!

 కాస్త చామనచాయ అయినప్పటికీ, ఇట్టే ఆకట్టుకునే అందం అమలాపాల్‌ సొంతం. ఈ మలయాళీ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావాలని ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ మంచి సమయం ఇంకా ఆమె దరిచేరలేదు. మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తున్న ఈ భామ టాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, వరుసగా వచ్చిన రెండు ఫెయిల్యూర్లు సినిమాలు సన్నగిల్లేటట్లు చేశాయని విశ్లేషకులు అంటున్నారు. నాగచైతన్య 'బెజవాడ', సిద్ధార్థ 'లవ్‌ ఫెయిల్యూర్‌' చిత్రాల్లో అమలాపాలే నాయిక. 'బెజవాడ' చిత్రం వర్మ చేసిన హంగామా స్థాయిలో లేకపోవడమే కాదు బాక్సాఫీసు వద్ద తుస్సుమనడంతో ఈ భామ అంచనాలు కాస్తా వమ్మయ్యాయి. ఆ తర్వాత నెగటివ్‌ టైటిల్‌తో వచ్చిన 'లవ్‌ ఫెయిల్యూర్‌'ను ప్రేక్షకులు ఫెయిల్యూర్‌ చేయడంతో అమలాపాల్‌కు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ఇక అనువాద చిత్రాలు కూడా ఆమెకు తగినంత గుర్తింపును ఇవ్వలేకపోయాయి. లోగడ వచ్చిన 'నాన్న', 'ప్రేమఖైదీ' చక్కటి చిత్రాలు అనిపించుకున్నప్పటికీ, కమర్షియల్‌గా ఆశించినంత విజయాన్ని అవి అందుకోలేకపోయాయి. తాజాగా 'భలే తమ్ముడు' అనే ఇంకో అనువాద చిత్రంతో అమలాపాల్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాధవన్‌, ఆర్య, సమీరారెడ్డి వంటి నటీనటులతో కలసి ఆమె ఆ చిత్రంలో నటించారు. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, తప్పకుండా తనకు తెలుగులో అవకాశాలు వచ్చేటట్లు చేస్తుందని ఆమె విశ్వసిస్తోంది.