ఉపఎన్నికలపై సీఎం కిరణ్‌ ఫోకస్‌

ఉపఎన్నికలపై సీఎం కిరణ్‌ ఫోకస్‌

హైకమాండ్‌ కర్తవ్య బోధతో కదన రంగంలో కాలు మోపనున్నారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజాపథం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు. 21 రోజుల పాటు జనం బాటపట్టనున్నారు. అభివృద్ధి మంత్రంతో సత్తా చాటాలనుకుంటున్నారు.

సర్కారు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పట్ల వారిని ఆకర్షితులను చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు రంగం చేసుకున్నారు ముఖ్యమంత్రి కిర్‌కుమార్‌రెడ్డి. ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ టూర్‌ ప్లాన్‌ చేశారు. ఇవాళ్టి నుంచి 21 రోజుల పాటు జిల్లాల బాట పట్టనున్నారు. వీటిలో 15 రోజులు బై పోల్స్‌ జరిగే నియోజకవర్గాల్లోనే పర్యటించనున్నారు.

ఇవాళ YSR కడప జిల్లాలో సీఎం కిరణ్‌ పర్యటించనున్నారు. ఉప ఎన్నికలు జరిగే రైల్వేకోడూరు, రాజంపేటలతోపాటు నందలూరు, ఒంటిమిట్టలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముందు రైల్వేకోడూరులో ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తారు.

అక్కడ ఏర్పాటు చేసిన ప్రజాపథంలో పాల్గోని అర్హులైన వారికి వివిధ ప్రొత్సాహాకాలను అందిస్తారు. అనంతరం మంగపేట కు చేరుకొని పునరావాస కాలనీకి శంఖుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి పుల్లంపేటకు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆ తర్వాత రాజంపేట బహిరంగసభలో పాల్గొంటారు. అక్కణ్నుంచి నేరుగా ప్రజాపథంలో హాజరయ్యేందుకు సీఎం కిరణ్‌ నందలూరు వెల్తారు. ఒంటిమిట్ట టూర్‌ తర్వాత ఈ రాత్రి కడపలో బసచేస్తారు. రేపు ఉదయం స్వగ్రామమైన చిత్తూరు జిల్లా కలికిరికి చేరుకుంటారు కిరణ్‌. ఎల్లుండి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ఉప ఎన్నికల రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జిల్లా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే బైపోల్‌ పార్టీ వ్యూహంపై జిల్లా నేతలు, అభ్యర్థులతో చర్చించనున్నారు. జిల్లా కాంగ్రెస్ లో నేతల హడావిడి తప్ప కార్యకర్తలు, ప్రజల్లో స్తబ్దత ఉన్న నేపథ్యంలో వారిలో ఉత్సాహాన్ని నింపి ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయడమే సీఎం పర్యటనల లక్ష్యం కానుంది.