పీపుల్స్‌వార్:నారాయణ మూర్తి

పీపుల్స్‌వార్:నారాయణ మూర్తి

ఆర్.నారాయణమూర్తి మళ్లీ మరో సెల్యులాయిడ్ బాణం ఎక్కుపెట్టారు. అదే ‘పీపుల్స్‌వార్'. వ్యవసాయ భూములను పరిశ్రమలతో నాశనం చేయొద్దనే సందేశంతో స్వీయ దర్శకత్వంలో తను నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. శ్రీహరి, పోసాని కృష్ణమురళి, తాన్వి ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ- ‘‘ప్రభుత్వం రాష్ట్రవ్యప్తంగా ఏర్పాటు చేస్తున్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లుకు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. అందుకే ఇటీవల సోంపేట, కాకరాపల్లి, కురుపాం తదితర ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లను వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. ఆ ఉద్యమాలకు సంఘీభావమే నా సినిమా. 

ఆ ఉద్యమకారులే నా హీరోలు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక విధానలే విలన్లు. ఉద్యమంలో అమరుడైన గుణ్ణం జోగారావుగా శ్రీహరి నటించారు. పోసాని ప్రతినాయకునిగా కనిపిస్తారు'' అని తెలిపారు. కొండవలస, ఎల్బీ శ్రీరామ్, కోట శంకర్రావు, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయ్‌కుమార్, ఎడిటింగ్: రాజా, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కథ, చిత్రానువాదం, మాటలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: ఆర్.నారాయణమూర్తి.