SEZల పేరుతో ప్రభుత్వం రియల్‌ వ్యాపారం

SEZల పేరుతో ప్రభుత్వం రియల్‌  వ్యాపారం

SEZల పేరుతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సర్కార్‌పై మండిపడ్డారు. కాకినాడ SEZలో 450 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, కేవలం ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం రైతుల పొట్ట కొట్టి వేలాది ఎకరాలను అక్రమంగా దారాదత్తం చేశారని ఆరోపించారు. తక్షణమే కాకినాడ సెజ్‌ను రద్దు చేసి రైతుల భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.

బర్త్‌ డే రోజు SEZలపై సమర భేరీ మోగించిన TDP అధినేత చంద్రబాబు బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. పచ్చని సాగు భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుని ఓ ప్రైవేట్ వ్యక్తికి 5 వేల ఎకరాలు దారాదత్తం చేశారంటూ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. సెజ్ వల్ల భూములు కోల్పోయిన రైతు కుటుంబాల దుస్దితిపై కాకినాడ సూర్యకళామందిరంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వర్క్ షాపులో బాబు పాల్గొని ప్రసంగించారు. 

ప్రభుత్వ పెద్దలు కొందరు భారీగా ముడుపులు తీసుకుని రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. SEZలో 200 కోట్లు పెట్టుబడులు పెట్టి 650 కోట్లు బ్యాంక్ రుణాలు తెచ్చకున్నారని బాబు ఆరోపించారు. సెజ్ నోటిఫికేషన్ ఇచ్చి ఏడేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ రాలేదని, కనీసం అక్కడ ఏ పరిశ్రమలు స్థాపిస్తారో తెలియని స్థితిలో సర్కార్‌ వుందన్నారు. 

రమణక్కపేట, మూలపేటలలో చంద్రబాబు పర్యటించి సెజ్‌ భూములను పరిశీలించారు. అక్కడే నాగలి పట్టి, కారెద్దులతో ఏరువాక నిర్వహించారు. అనంతరం గత కొద్ది రోజులుగా వంటావార్పు కార్యక్రమం ద్వారా నిరశన తెలుపుతున్న రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా భారీవర్షం కురిసినా బాబు వేదిక దిగలేదు.

వానలో తడుస్తూ అక్కడే ఉండిపోయారు. వర్షం నిలిచిన తర్వాత చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. రైతులు భూముల్లో సాగుచేసుకోవాలని.. ఎవరైనా అడ్డుకుంటే తిరగబడాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.అంతకుముందు క్రిష్టియన్ కమ్యూనిటీ హాల్‌లో క్రైస్తవులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కార్యకర్తలు బాబు సమక్షంలో టిడిపిలో చేరారు.

SEZలకు వ్యతిరేకంగా పోరు విజయవంతం కావడంతో చంద్రబాబు ఉల్లాసంగా కన్పించారు. పిఠాపురం నుండి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, దాడి వీరభద్రరావు, యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.