పూర్తికానున్న గాలి పదవీ కాలం

పూర్తికానున్న గాలి  పదవీ కాలం

 కర్నాటక మాజీ మంత్రి  గాలి జనార్ధన్ రెడ్డి పదవీకాలం జైలులోనే ముగిసేలా కనిపిస్తోంది. గనుల అక్రమ తవ్వకాల కేసుల్లో జైలు ఊచలు లెక్కిస్తున్న గాలి జనార్దన్‌ రెడ్డి పదవీకాలం జూన్ 17తో ముగియనుంది. ఆ లోపు గాలికి బెయిల్ లభించే అవకాశాలు తక్కువేనని సిబిఐ వర్గాలంటున్నాయి. దీంతో ఆయన జైల్లోనే పదవీకాలం ముగిసిన తొలి ఎమ్మెల్సీ కానున్నారు.

బళ్లారి జిల్లాను బిజెపి కంచుకోటగా మార్చి రాజ్యమేలిన గాలి గత ఏడాది జూలై 30న యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మంత్రి పదవి కోల్పోయారు. అనంతరం గనుల కుంభకోణాలపై ఆంధ్రప్రదేశ్‌లో సిబిఐ దర్యాప్తు ప్రారంభమయింది. సెప్టెంబర్ 6న గాలిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఇటీవలి వరకూ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో గడిపిన ఆయన ప్రస్తుతం ఎఎంసి కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు.

ఒఎంసి కేసులో బెయిల్ లభించినప్పటికీ ఎఎంసీలో అక్రమాలకు సంబంధించి బెయిల్ రాకపోవడంతో గాలికి జైలు జీవితం తప్పడం లేదు. కాగా, సెప్టెంబర్ 6 నుంచి జైల్లోనే ఉన్న గాలి కర్ణాటక విధాన పరిషత్ కార్యకలాపాలకు హాజరు కాలేకపోయారు. నిబంధనల ప్రకారం వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే సభ్యత్వం రద్దు కావాల్సి ఉంది. అయితే త్వరలోనే సభ్యత్వం రద్దుకానుండటంతో ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

కాగా జగన్ అక్రమాస్తులపై దర్యాప్తునకు సిద్ధమైన ఈడి అందుకు కావాల్సిన అస్త్రాలను క్రమంగా సమకూర్చుకుంటోంది. ఒఎంసి కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై దాఖలైన అదనపు చార్జిషీటును ఈడికి ఇచ్చేందుకు సిబిఐ కోర్టు మంగళవారం అనుమతించింది. జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసుల్లో దాఖలైన చార్జిషీట్లను కూడా ఈడికి ఇవ్వడానికి కోర్టు గతంలోనే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, జగన్ అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారించేందుకు ఈడి పెట్టుకున్న పిటిషన్‌పై సిబిఐ కోర్టులో బుధవారం విచారణ జరగనుంది. ఇక ఎమ్మార్ కేసులో కోనేరు మధు హైదరాబాద్ విడిచి వెళ్లకుండా పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని సిబిఐ సమర్పించిన మెమోపై విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. మరోవైపు జగన్ ఆస్తుల కేసులో దాఖలైన తొలి రెండు చార్జిషీట్లను ఈ కేసు నిందితుడు విజయ సాయి రెడ్డికి ఇచ్చేందుకు కూడా కోర్టు అనుమతించింది.