సిఎంకు చేతులు జోడిస్తున్నా

సిఎంకు చేతులు జోడిస్తున్నా

  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాకు ప్రభుత్వం ప్రకటనలు రద్దు చేయడం సరికాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత  కె కేశవ రావుగురువారం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడానికి, కేసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రకటనల నిలిపివేత అమానుషమన్నారు. ఎలాంటి కారణం లేకుండా ప్రకటనలు ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు.

ప్రకటనల నిలిపివేతకు గల కారణాలను విడుదల చేసిన జివోలో చూపించలేదన్నారు. ఇది అత్యుత్సాహంతో చేసిన పని అని మండిపడ్డారు. నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా దీనిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. జివో 2079లో కారణాలు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. కొత్త వ్యవస్థని నెలకొల్పలేకపోతున్నామని, ఉన్న వ్యవస్థని పాడు చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.

సిబిఐ దర్యాఫ్తు చేస్తున్నంత మాత్రాన ప్రకటనలు నిలిపివేయవలసిన అవసరమేముందన్నారు. పత్రికకు, టివికి పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని అన్నారు. ఇటువంటి చర్యలు నిలిపివేయమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చేతులు జోడించి కోరుతున్నానని అన్నారు. ఎన్నికలు జరిగే వేళ పత్రికా స్వేచ్ఛకు కాంగ్రెసు వ్యతిరేకమనే అభిప్రాయం కలిగించవద్దన్నారు. దేవుడు పెట్టినా దయ్యం పెట్టినా పత్రిక పత్రికే అన్నారు.

కాగా బుధవారం ఖాతాల స్తంభన విషయంలో సిబిఐది తొందర పాట చర్య అని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్న విషయం తెలిసిందే. సాక్షి అకౌంట్ల సీజ్ చట్ట విరుద్దమైన చర్య అన్నారు. కోర్టు అనుమతితో నోటీసులు అందించి సీజ్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విచారణ సంస్థలు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు.

సిబిఐ దూకుడుగా వ్యవహరించడం వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ఈ వ్యవహారం వల్ల జగన్ పైన కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలకు ఊతమిచ్చినట్లయిందన్నారు. ఇకనైనా దర్యాఫ్తు సంస్థలు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు.