రసకందాయంలో కర్నాటకం

రసకందాయంలో కర్నాటకం

కర్నాటక భారతీయ జనతా పార్టీ వ్యవహారం రసకంధాయంలో పడింది. సదానంద గౌడ ప్రభుత్వానికి ఏ క్షణంలోనైనా ముప్పు పొంచి ఉంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప  భారతీయ జనతా పార్టీ ని విడిచేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. యడ్డీ సోమవారం ఉదయం బిజెపి ఎమ్మెల్యేలు, మంత్రులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సుమారు డెబ్బై మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది మంత్రులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఇప్పటికే ఇరవై మంది ఎమ్మెల్యేలు, మంత్రులు యడ్డీ అల్పాహార విందు ఇచ్చే ప్రదేశానికి చేరుకున్నారు. యడ్డీ ఎమ్మెల్యేలను, మంత్రులను విడివిడిగాను, కలిసి ఎవరికి మద్దతిస్తారు, తాను పార్టీ వీడితే తనతో వస్తారా అని అడుగుతున్నారని తెలుస్తోంది. ఆయన ఏ క్షణంలోనైనా తన వర్గం వారితో కలిసి పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రోజు అల్పాహార విందులో తనకు ఎందరు మద్దతివ్వనున్నారో స్పష్టంగా అంచనా వేసుకొని, వారి నుండి అభిప్రాయాలు తీసుకొని సాయంత్రం లోగా యడ్డీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

సదానంద గౌడ కేబినెట్లోని యడ్డీ వర్గం శోభా కందర్లాజే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రికి అనుకూలంగా అధిష్టానాన్ని ఒప్పించేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆమె యడ్డీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని అధిష్టానానికి సూచిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సదానంద గౌడ వర్గం ఎమ్మెల్యేలు పలువురు కూడా ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పే పనిలో పడ్డారు. యడ్డీ పార్టీని వీడతారనే వార్తల నేపథ్యంలో బిజెపి అధిష్టానం స్పందించింది. తాము యడ్డీని వదులుకోమని స్పష్టం చేసింది.

ప్రస్తుతం కర్నాటక బిజెపి ఉన్న పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చి సర్ది చెప్పేందుకు ఏ జాతీయ నేత సిద్ధంగా లేరని తెలుస్తోంది. అరుణ్ జైట్లీని పంపించేందుకు అధిష్టానం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. జైట్లీతో యడ్డీకి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో అతని ద్వారా బుజ్జగింపులు జరపాలని భావిస్తోందని తెలుస్తోంది.  యడ్డీ  పార్టీని వీడి కొత్త పార్టీ పెడతారా మరి పార్టీలోనే ఉంటారా అనేది ఈ సాయంత్రానికి తేలే అవకాశముంది.