భూమికి దగ్గరగా వస్తున్న చంద్రుడు

భూమికి దగ్గరగా వస్తున్న చంద్రుడు

ఆకాశంలో మరో అద్భుతం సాక్షాత్కరించనుంది. వెండి వెలుగులు విరజిమ్మే చందమామ మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. వినువీధిలో మబ్బులు కమ్ముకోకుంటే ప్రతి ఒక్కరు చంద్రమామ ప్రత్యేక కాంతి వీక్షించే అవకాశం ఉంది.

లోకమంతటికీ మామ ఎవరంటే.. చందమామ పేరే వినిపిస్తుంది. పాలుతాగే చంటిబిడ్డ నుంచి ప్రేమికులు, కవుల వరకు ప్రతి ఒక్కరికీ తారాధిపతి ఆత్మీయుడే. వెండి వెలుగులు విరజిమ్మే చంద్రుడు... భూమికి సమీపంలోని బిందువులోకి రాబోతున్నాడు. దీంతో.. మామూలు కన్నా 14 శాతం పెద్దగా కనిపించనున్నాడు. సాధారణంగా పౌర్ణమి రోజున చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ఈసారి మరిన్ని వెలుగులతో ప్రకాశించనున్నాడు.

వినువీధిలో కనువిందు చేయనున్న చంద్రవదనాన్ని రెండ్రోజులు వీక్షించే అవకాశం ఉంది. ఇలా.. పౌర్ణమి రోజున చందమామ పెద్దగా కనిపించడాన్ని సూపర్‌మూన్‌ అంటారు. ఇలాంటిదే మరో విశేషం కూడా ఉంది. అదే బ్లూమూన్. అంటే.. చంద్రుడు నీలి రంగులోకి మారతాడని కాదు. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే.. రెండో పున్నమి చంద్రుడ్ని బ్లూమూన్‌గా పిలుస్తారు. ఈ విశిష్ట రోజుల్లో భూమండలంపై ఏమైనా మార్పులు సంభవిస్తాయా అనే కోణంలో ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తుంటారు. ఈ రాత్రి మబ్బులు రాకుంటే మీరు కూడా చంద్రుణ్ని దర్శించుకుని పిండివెన్నెల అనుభూతులను సొంతం చేసుకొండి.