జగతిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి?

 జగతిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంపై సిబిఐ తన రెండో చార్జిషీట్‌లో వివరించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో దాఖలు చేసిన రెండో చార్జిషీట్‌లోని విషయాలపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఆ చార్జిషిట్ తమ వద్ద ఉందని ఆ సంస్థ చెప్పుకుంది. వైయస్ కదలించారు, సాయిరెడ్డి బెదిరించారు, వైయస్ జగన్ వసూలు చేసుకున్నారు అంటూ ఆ చానెల్ వ్యాఖ్యానించింది. 

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ కథనం ప్రకారం - తాము జగతి పబ్లికేషన్స్‌లో ఎలా పెట్టుబడులు పెట్టింది, ఆ తర్వాత ఏమైంది అనే విషయాలను దుబాయ్‌లోని వ్యాపారవేత్త మాధవ రామచంద్రన్, తమిళనాడుకు చెందిన కెఆర్ కన్నన్, దండమూడి సిబిఐకి వివరించారు. వారు చెప్పిన విషయాలను క్రోడీకరించి సిబిఐ రెండో చార్జిషీట్‌ను రూపొందించింది. డెలాయిట్ నివేదికను, విజయసాయి రెడ్డి మాటలను నమ్మి రామచంద్రన్ జగతిలో పెట్టుబడులు పెట్టారు. జగతి ప్రతినిధి శ్రీధర్ ఒత్తిడితో దండమూడి జగతిలో పది కోట్ల రూపాలు పెట్టుబడి పెట్టారు. తనకు డివిడెండ్ రాకపోవడంతో జగతి ప్రతినిధులను కలుసుకోవడానికి ప్రయత్నిస్తే లాభం కనిపించలేదని దండమూడి సిబిఐకి చెప్పారు.

కన్నన్ తమిళనాడుకు చెందిన జయలక్ష్మి టెక్స్‌టైల్స్ అధినేత. ఆయన జగతిలో ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని వైయస్ కోరారు. ఆ మేరకు ఆయన శ్రీ జయజ్యోతి సిమెంట్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఆ తర్వాత సాయిరెడ్డి ఆయనను కలిశారు. జగతిలో పెట్టుబడులు పెడితేనే సిమెంట్ వ్యాపారం సజావుగా సాగుతుందని చెప్పారు. విజయసాయి రెడ్డి కలిసిన తర్వాతే ఆ సంస్థకు లైసెన్స్ వచ్చింది. 

ఈ ముగ్గురు వాంగ్మూలాలను చూసిన తర్వాతనే జగతి పబ్లికేషన్స్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాల్సి వచ్చిందని సిబిఐ కోర్టుకు వివరించింది. మాధవ రాచమంద్రన్ బెంగళూర్‌కు చెందినవారు. ఆయన దుబాయ్‌లో స్థిరపడ్డారు. ఆయనను దుబాయ్‌లో ఓ సమావేశంలో వైయస్ రాజశేఖర రెడ్డి కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వనించారు. ఆ తర్వాత జగతి ప్రతినిధులు రామచంద్రన్‌ను సంప్రదించారు. 2008లో విజయసాయి రెడ్డి ఆయనను కలిశారు. జిబిఎ ప్రోడక్ట్స్ అధినేత. ఆయన 19.66 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. 

తనకు లాభాలు రాకపోవడంతో, వడ్డీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో రామచంద్రన్ జగతి ప్రతినిధులను సంప్రదించారు. ఫోన్ చేశారు. కానీ జగతి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. జగతి పబ్లికేషన్స్ విలువను ఎక్కువ చేసి చూపడం వల్ల, సాయిరెడ్డి మాటలు వినడం వల్ల తాము జగతిలో పెట్టుబడులు పెట్టామని ఆ ముగ్గురు అంటున్నారు. మీడియా సంస్థలను పెట్టిన తర్వాత ఐదేళ్ల వరకు బ్రేక్ ఈవెన్ రాదనే విషయాన్ని దాచిపెట్టి పెట్టుబడులు సేకరించారని సిబిఐ  ఆరోపించిది. అదే విధంగా అన్ లిస్టెడ్ కంపెనీల నుంచి పెట్టుబడులు సేకరించారని తెలిపింది. జగతి పబ్లికేషన్స్ నుంచి డబ్బులు దారి మళ్లుతున్నాయని, అందుకే ఫ్రీజ్ చేశామని చెప్పారు.