లింగు స్వామి దర్శకత్వంలో మహేష్

లింగు స్వామి దర్శకత్వంలో మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్  మహేష్ బాబుకు  ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెద్ద పెద్ద స్టార్లు, సెలబ్రిటీలు, రాజకీయకులు కూడా ఇందులో ఉన్నారు. తాజాగా ఆయన అభిమానుల లిస్టులో ఓ బిగ్ డైరెక్టర్ చేరాడు. ప్రముఖ తమిళ దర్శకుడు లింగు స్వామి ఇటీవల హైదరాబాద్‌లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. అతనితో సినిమా తీయాలనే కోరికను ఈ సందర్భంగా లింగుస్వామి పరోక్షంగా బయట పెట్టారు. 

త్వరలో వీరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి లింగులు స్వామి ఇటీవల తమిళంలో రూపొందించిన హిట్ మూవీ ‘వెట్టై' చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా తెలుగులో రీమేక్ చేయాలని భావించాడట. అయితే మహేష్ బాబు పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఆ చిత్రాన్ని ‘భలే తమ్ముడు' పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. 

మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమల పాల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన ‘వెట్టై' తెలుగులో ‘భలే తమ్ముడు' పేరుతో విడుదల చేస్తున్నారు. మాధవన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆర్య మాధవన్ తమ్ముడి పాత్రలో నటించాడు. సమీరారెడ్డి, అమలపాల్ అక్క చెల్లుల్లుగా నటించారు.

అయితే ఈచిత్రం తన స్టార్ ఇమేజ్‌తో సరితూగదని భావించిన మహేష్ బాబు...ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉన్నానని లింగుస్వామి ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో మహేష్ బాబు మెచ్చే కథతో రావడానికి రెడీ అవుతున్నాడు లింగుస్వామి. ప్రస్తుతం మహేష్ బాబు....శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈచిత్రం తర్వాత బయోయపాటి దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.