యడ్డీపై, కొడుకులపై ఎఫ్ఐఆర్ నమోదు

యడ్డీపై, కొడుకులపై ఎఫ్ఐఆర్ నమోదు

 సొంత పార్టీ భారతీయ జనతా పార్టీని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత యడ్యూరప్పకు మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) గట్టి షాక్ ఇచ్చింది. కర్నాటకలో అక్రమ మైనింగ్ కేసులో యడ్యూరప్ప పైన, ఆయన తనయుల పైన సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. యడ్యూరప్పతో పాటు ఆయన తనయులు బివై విజయేంద్ర, బివై రాఘవేంద్ర అల్లుడు సోహన్ కుమార్‌, ప్రేమచంద్ర, సౌత్ వెస్ట్ కంపెనీలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

సిబిఐ తన ఎఫ్ఐఆర్‌లో యడ్డీని ఎ-1గా, ఆయన తనయులను ఎ-2, ఎ-3గా, అల్లుడిని ఎ-4గా, ప్రేమచంద్రను ఎ-5గా, సౌత్ వెస్ట్ కంపెనీలపై ఎ-6గా పేర్కొంది. తొమ్మిది మందితో కూడిన సిబిఐ టీమ్ కర్నాటకలో అక్రమ మైనింగ్ కేసును విచారిస్తోంది. కాగా కర్నాటకలో జరిగిన అక్రమ మైనింగ్‌లో యడ్డీ పాత్రపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన మూడు రోజులలోనే సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. అక్రమ మైనింగ్‌లో యడ్డీకి, అతని తనయులకు రూ.40 కోట్ల ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కాగా గత శుక్రవారం  యడ్యూరప్పకు   సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు శుక్రవారం సిబిఐ విచారణకు ఆదేశించింది. మైనింగ్ కుంభకోణంలో యడ్యూరప్ప పాత్రపై జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ సిబిఐ విచారణకు ఆదేశించింది. 

మైనింగ్ సంస్థల నుంచి యడ్యూరప్ప కుటుంబ సభ్యులు భూముల డీనోటిఫికేషన్ విషయంలో లంచాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఇంతకు ముందు సాధికారిక కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు యడ్యూరప్పపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ముడి ఇనుము అక్రమ ఎగుమతిలో, కొంత మంది పోలీసు అధికారుల బదిలీలో, తు కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చిన భూవ్యవహారాల్లో యడ్యూరప్ప పాత్ర ఉందని సాధికారిక కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. 

యడ్యూరప్పపై వచ్చిన ఆరోపణలు మీద సిబిఐ దర్యాప్తు అవసరమని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. బెంగళూర్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల డీనోటిఫికేషన్‌పై సిబిఐ దర్యాప్తు చేయవచ్చునని కమిటీ సూచించింది. జిందాల్ స్టీల్‌ అనుబంధ సంస్థ సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి మైనిండ్ డీల్‌లో ప్రయోజనం చేకూర్చారని వచ్చిన ఆరోపణపై దర్యాప్తు అవసరమని కూడా చెప్పింది. యడ్యూరప్ప కుటుంబ సభ్యులు నడుపుతున్న ప్రేరణ ఎడ్యుకేషన్ సొసైటీకి భారీ విరాళాలు ఇవ్వడానికి, భూముల డీనోటిఫికేషన్‌కు మధ్య సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి.