జగన్‌కు ఓటేస్తే అంతే: కిరణ్

జగన్‌కు ఓటేస్తే అంతే: కిరణ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతిపరుడు అని ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలు, జిల్లాకు చెందిన మేధావులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జగన్ అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో, బిజెపితో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. అందుకే టిడిపి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారన్నారు.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు గెలిచినా కాంగ్రెసును కాదని ఏమీ చేయలేరన్నారు. చంద్రబాబు, జగన్ వద్ద నీతి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మేధావుల సదస్సులో మాట్లాడుతూ.. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న సుబ్బిరామి రెడ్డి విశాఖను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారన్నారు.

అలాంటి వ్యక్తి రూ.1400 కోట్లతో నెల్లూరులో విద్యుత్ పరిశ్రమ స్థాపిస్తున్నారన్నారు. నెల్లూరులో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారని, కాబట్టి ఆయన నెల్లూరును వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికి నెల్లూరు నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. సుబ్బిరామి రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వం మెడికల్ కళాశాలకు, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైనుకు అనుమతులు వెంటనే లభిస్తాయన్నారు.

మేధావులు ఓసారి ఆలోచించి సుబ్బిరామి రెడ్డికి ఓటు వేయాలని కోరారు. దురదృష్టవశాత్తూ నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోతోందని, ఈసారి ఆ ఆనవాయితీని తిప్పికొట్టి ఓటింగ్ శాతాన్ని పెంచి సుబ్బిరామి రెడ్డికి అండగా నిలవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి రాంనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం వివేకానంద రెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణా రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు చాట్ల నరసింహ రావు తదితరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు ఉప ఎన్నికలలో సానుభూతి కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి  జైలులో ఉన్నట్లు ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేయించారని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించ వద్దని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు.