'వైయస్'పై చేతులెత్తేస్తున్న కాంగ్రెస్

'వైయస్'పై చేతులెత్తేస్తున్న కాంగ్రెస్

 దివంగత ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర రెడ్డి తప్పులను కోర్టు నిర్ధారిస్తుందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. స్వార్థంతో కొందరు తప్పులు చేస్తే కాంగ్రెస్ ఎందుకు బాధ్యత వహిస్తుందని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసినవారే అందుకు బాధ్యులని స్పష్టం చేశారు. కోర్టులో జరిగి విచారణలో వైయస్ నేరస్థుడా కాదా అని తెలుతుందన్నారు. వ్యక్తులు వారి వారి ప్రయోజనాల కోసం చేసిన వాటికి కాంగ్రెసు ఎలా బాధ్యత వహిస్తుందన్నారు.

వైయస్ తప్పులకు బాధ్యత ఆయనదేనని, పార్టీకి సంబంధం లేదని పిసిసి అధికార ప్రతినిధి కమలాకర్ రావు అన్నారు. పుత్రవాత్సల్యంతో ఆయన తప్పులు చేస్తే వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి మాత్రమే బాధ్యత వహించాలన్నారు. మంత్రులు పరిధి దాటి తప్పుచేస్తే శిక్షను అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. ఉప ఎన్నికల వాయిదాకు ఢిల్లీ పెద్దలు కుట్రపన్నుతున్నారన్న వైయస్ జగన్ ఆరోపణలు హాస్యాస్పదమని పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.

కుట్రలో భాగంగా మూడు నాలుగు రోజుల్లో తనను అరెస్టు చేయించి, కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కై అల్లర్లు సృష్టించాలని చూస్తున్నట్లు జగన్ మాట్లాడటంపై మండిపడ్డారు. హిస్టీరియా రోగిలా ప్రవర్తిస్తున్న ఆయన, ప్రజల సానుభూతి కోసం నాటకాలాడటం కట్టిపెట్టాలని హెచ్చరించారు. ఒకవేళ సిబిఐ అరెస్టు చేస్తే అల్లర్లు చేయించి, తప్పించుకునే కుయుక్తితో ఎలిబీ సృష్టించుకునేందుకు యత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. 

వైయస్ జగన్ దురాశవల్లే ఉప ఎన్నికలు వచ్చాయని మాజీమంత్రి పాలడుగు వెంకటరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు, కుల అహంకారంతో అధికారం కూడా తన ఇంట్లోనే ఉండాలన్న జగన్ ఓ అరాచకవాది అని అభివర్ణించారు. సర్వం తానేనన్నట్లు అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైయస్ తప్పులపై క్షమాపణ చెప్పినందుకు తనను అభినందిస్తూ వందల సంఖ్యలో ఫోన్లు వచ్చాయన్నారు. 

కాంగ్రెస్ సిఎంగా చనిపోయారు కాబట్టి ఆయన తప్పులన్నీ పార్టీ ఖాతాలోకే వస్తాయన్నారు. వైయస్ తప్పులకు రాష్ట్ర నేతలుగా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పాలని అభిప్రాయపడ్డారు. కాగా, వైయస్ జగన్ చెల్లని పైసా అవునో కాదో ఇప్పుడే చెప్పలేనని ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి చెప్పారు. మంగళవారం ఆమెతోపాటు మరో ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు విలేకరులతో మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మెప్పుకోసం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరో లాటరీ నకిలీ విజేత కోలా కృష్ణ మోహన్ నుంచి చందా తీసుకున్న బాబు నీతి నిజాయతీల గురించి మాట్లాడడం ఏమిటని నిలదీశారు. రాజకీయాల్లో బాబు సత్తుపైసా చెల్లని పైసా పనికి రాని పైసాలాంటి వారని ఎద్దేవా చేశారు. జగన్ సత్తు పైసా అవునో కాదో ఇప్పుడు చెప్పలేనన్నారు. తాను ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్‌లోకి రాలేదని, కాంగ్రెస్ లేకపోతే తాము లేనేలేమని పేర్కొన్నారు. 

వైయస్ మంచిపనులన్నీ కాంగ్రెస్ ఖాతాలోకి వస్తాయి తప్ప ఆయన చెడ్డపనులతో పార్టీకి సంబంధమేమిటని ఏఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసిన పుత్రరత్నం అంటూ జగన్‌పై ధ్వజమెత్తారు. సిబిఐ విచారణ తర్వాత కోర్టు నిర్ధారిస్తే వైయస్ విషయంలో పార్టీ అభిప్రాయం చెబుతామన్నారు. ఉప ఎన్నికలు పార్టీ పరిస్థితి బేరీజుకు మాత్రమేనని, అత్యధిక స్థానాలు వచ్చినా రాకపోయినా పార్టీకి నష్టమేమీ ఉండదని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌పై చంద్రబాబు, జగన్ విమర్శలను పార్టీ నేతలు, కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మూడు నెలల్లోగా సోనియా తెలంగాణ ఇస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడాన్ని స్వాగతించారు.