కెఎ పాల్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్

కెఎ పాల్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్

ఉప ఎన్నికల నేపథ్యంలో క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కెఎ పాల్ మధ్యంతర బెయిల్‌కు ఆయన తరఫు న్యాయవాది లంచ్ మోషన్ మూవ్ చేశారు. దానిపై హైకోర్టు గురువారం పాల్‌కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రజాశాంతి అధ్యక్షుడిగా ఉన్న పాల్ ప్రచారం సాగించాల్సి ఉందని చెబుతూ అందువల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు.

దాంతో హైకోర్టు కెఎ పాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును స్వాధీనం చేయాలని ఆదేశించింది. వచ్చే నెల 11వ తేదీన లొంగిపోవాలని షరతు పెట్టింది. తొలుత ప్రకాశం జిల్లా సెషన్స్ కోర్టులో పాల్ మధ్యంతర బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. అందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. పాల్ తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో నిందితుడు. మరో సోదరుడు కోటేశ్వర రావుపై హత్యా ప్రయత్నం చేశాడనే ఆరోపణ కూడా ఆయనపై ఉంది. 

కెఎ పాల్ ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లోనూ ప్రజా శాంతి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టడానకి ప్రయత్నించారని, అయితే అరెస్టు వల్ల అది సాధ్య పడలేదని, నాలుగు స్థానాల్లో మాత్రం ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారని, వారి తరఫున పాల్ ప్రచారం చేయాల్సి ఉంటుందని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. అందుకే మధ్యంతర బెయిల్ కోరినట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికల పోలింగ్ జూన్ 12వ తేదీన జరుగుతుంది. దీంతో జూన్ 11వ తేదీన సరెండర్ కావాలని హైకోర్టు పాల్‌ను ఆదేశించింది.

క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్‌ను పోలీసులు మే 21వ తేదీన అరెస్టు చేశారు. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో ఆయనను పోలీసులు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అరెస్టు చేశారు. డేవిడ్ రాజ్ రెండేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

డేవిడ్ రాజుకు, కెఎ పాల్‌కు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఈ ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును కెఎ పాల్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆస్తులపై పరస్పరం కేసులు పెట్టుకుని వివాదానికి దిగారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి కొంత మంది క్రైస్తవ మత పెద్దలు ప్రయత్నించారు.