సాక్షి ఖాతాల స్తంభనపై జడ్జి

సాక్షి ఖాతాల స్తంభనపై జడ్జి

సాక్షి మీడియా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తే ఉద్యోగుల వేతనాలను ఎవరు చెల్లిస్తారని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. రోజువారీ వ్యాపార లావాదేవీల కోసం, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని సాక్షి తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. తమ ఖాతాలను పునరుద్ధరింపజేయాలని  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా వేసిన పిటిషన్‌పై జరిగిన వాదన సందర్భంగా న్యాయమూర్తి ఆ ప్రశ్న వేశారు.

సాక్షి పత్రికకు, చానెల్‌కు నష్టం వస్తే ఎవరు భర్తీ చేస్తారని కూడా న్యాయమూర్తి సిబిఐని అడిగారు. బ్యాంకు ఖాతాల నిలుపుదలతో కంపెనీ ప్రతిష్ట దెబ్బ తింటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఖాతాలను పునరుద్ధరిస్తే అందుకు బ్యాంకులో ఉన్న 9 కోట్ల రూపాయలకు గ్యారింటీ చూపుతామని సాక్షి తరఫు న్యాయవాదులు చెప్పారు. రోజువారీ లావాదేవీలకు మాత్రమే ఖాతాలను వాడుతామని చెప్పారు. 

సాక్షి మీడియాకు సంబంధించి 74 కోట్ల రూపాయలు మాత్రమే అక్రమమని చూపించారని, అది రూ. 1172 కోట్ల రూపాయల్లో పాక్షికం మాత్రమేనని వారన్నారు. బ్యాంక్ ఖాతాల స్తంభన వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని, రోజువారీ కార్యక్రమాలు దెబ్బ తింటాయని వారు చెప్పారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు 102 కోట్ల రూపాయలున్నాయని వారు చెప్పారు. 

సాక్షి మీడియాకు సంబంధించి 1172 కోట్ల రూపాయలతో పాటు సాక్షి మీడియా చెబుతున్న 9 కోట్ల రూపాయలు కూడా అక్రమ పెట్టుబడులేనని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. సర్క్యులేషన్ ద్వారా, ప్రకటనల ద్వారా వచ్చే వచ్చే డబ్బులతో సాక్షిని నడుపుకోవచ్చునని సూచించారు.  సాక్షి మీడియా  పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు ముగిసే అవకాశం ఉంది.