ఇద్దరికీ జగనే ప్రత్యర్థి

ఇద్దరికీ జగనే ప్రత్యర్థి

 ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రత్యర్థిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మిగిలిపోయారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు వైయస్ జగన్‌పైనే ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు పరస్పరం తక్కువగా విమర్శలు చేసుకుంటున్నాయి. దీన్ని వైయస్ జగన్ ఈ రెండు పార్టీల మధ్య కుమ్మక్కుగా అభివర్ణిస్తున్నారు. కానీ, జగన్ మాత్రమే తమకు పోటీ ఇస్తాడనే భావన వల్ల అలా జరుగుతూ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

రాష్ట్రంలోని 18 శాసనసభ స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి జూన్ 12వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల నాయకులు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో వైయస్ జగన్‌పై గుక్క తిప్పుకోకుండా విమర్శలే కాదు, తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి సంబంధించి, హత్యలకు సంబంధించి వైయస్ జగన్‌పై ఆయన దుమ్మెత్తి పోస్తున్నారు. 

పరిటాల రవి హత్య దగ్గర నుంచి మద్దెలచెర్వు సూరి హత్య వరకు - అన్నింటితోనూ జగన్‌కు సంబంధాలు అంటగడుతూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. భాను కిరణ్ నుంచి మంగలి కృష్ణ వరకు కూడా వారందరితో జగన్‌కు సంబంధాలను అంటగడుతూ ధ్వజమెత్తుతున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి లెక్కే లేదు. తాజాగా, సిబిఐ జగన్ మీడియా సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడాన్ని తెలుగుదేశం పార్టీ బలపరుస్తోంది. తమకు సంబంధం లేదని, అంతా సిబిఐ చేస్తుందే అని కాంగ్రెసు పార్టీ నాయకులు తప్పించుకోవడానికి చూస్తుండగా, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం జగన్‌పై తీవ్రంగా ధ్వజమెత్తుతూ సిబిఐ చర్యలకు మద్దతు తెలుపుతున్నారు. 

వైయస్ జగన్‌ను తిప్పికొట్టడానికి వెనకాడుతున్నారంటూ పార్టీలోని తన ప్రత్యర్థుల నుంచి విమర్శలు రావడం వల్లనో, ఉప ఎన్నికల్లో ఏదో మేరకు సీట్లు సంపాదించాలనే ఉద్దేశంతోనో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్‌పై విమర్శల దూకుడు పెంచారు. అయితే, చంద్రబాబు చేసినంత తీవ్ర స్థాయిలో గానీ తమ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసినంత తీవ్ర స్థాయిలో గానీ లేవు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా వైయస్ జగన్‌పై కాస్తా తీవ్రంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే, చంద్రబాబు, ఇతర తెలుగుదేశం నాయకులు చేస్తున్నంత తీవ్ర స్థాయిలో ఈ విమర్శలు లేవు. జగన్‌ను చంద్రబాబు శత్రువుగా చూస్తుండగా, కాంగ్రెసు నాయకులు ప్రత్యర్థిగా చూస్తున్నట్లు కనిపిస్తోంది.