తారా చౌదరితో నాకు లింకేంటి

తారా చౌదరితో నాకు లింకేంటి

 సినీ నటి తారా చౌదరి కేసులో తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, శాసన సభ్యుడు  రేవంత్ రెడ్డి  శుక్రవారం సవాల్ చేశారు. పోలవరం టెండర్ల అక్రమాలను బయట పెట్టినందుకే తనపై అక్కసుతో తారా కేసులోకి తన పేరును లాగుతున్నారని మండిపడ్డారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు.

కొన్ని మీడియా సంస్థలు తారా చౌదరి కేసులోకి తనను ఉద్దేశ్య పూర్వకంగా లాగుతున్నాయని ఆయన ఆరోపించారు. తన పేరు లాగడం ద్వారా వారు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇది సరికాదన్నారు. దీనిపై తాను ఇప్పటికే పలువురు పాత్రికేయులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తే ఎలా అన్నారు. వారం రోజుల్లో తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ఆయన సవాల్ చేశారు.

కాగా ఉద్యోగాలు, సినిమాలలో అవకాశాల పేరుతో అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి నెడుతోందనే ఆరోపణలపై తారా చౌదరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను, ఆమె భర్త ప్రసాద్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. వారిని తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.

కోర్టు తారా చౌదరిని, ప్రసాద్‌ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. వారిని నాలుగు రోజుల పాటు విచారించిన పోలీసులు ఎన్నో కీలక ఆధారాలు సేకరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కస్టడీ ముగియడంతో తారా చౌదరి రిమాండును న్యాయస్థానం పొడిగించింది. ఆమెతో పాటు దుర్గా ప్రసాద్, ఆ తర్వాత అరెస్టు చేసిన హనీఫ్‌లకు కూడా కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

శుక్రవారం  తారా చౌదరి  రిమాండు ముగియడంతో పోలీసులు ఆమెను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆమె రిమాండును ఈ నెల 25 వరకు పొడిగించింది.