జగన్నెందుకు అరెస్ట్ చేయొద్దు

జగన్నెందుకు అరెస్ట్ చేయొద్దు

  వైయస్సార్ కాంగ్రెసు  పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి ని అరెస్టు చేస్తే ప్రళయం వస్తుందా అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ  శుక్రవారం ప్రశ్నించారు. ఆయన మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. దోపిడీదారులను నాయకులుగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందన్నారు. చిల్లర దొంగలను ఫోర్జరీ కేసులో అరెస్టు చేస్తున్నారని, అలాంటప్పుడు తప్పు చేసినట్టు తేలితే జగన్‌ను ఎందుకు అరెస్టు చేయకూడదని ప్రశ్నించారు.

అతనిని అరెస్టు చేస్తే ప్రళయం వస్తుందా అన్నారు. నీతివంతమైన పాలన గురించి మాట్లాడుతున్న జగన్ తనపై వస్తున్న ఆరోపణల నుండి బయటపడి ఎంత నీతిపరుడో నిరూపించుకోవాలని సవాల్ చేశారు. తన సంస్థలలోకి వచ్చిన పెట్టుబడులపై జగన్ జవాబు చెప్పాల్సిందేనని అన్నారు. జగన్ నీతి ఏమిటో సిబిఐ విచారణలో తెలుస్తుందన్నారు. అవకాశాన్ని ఆసరాగా తీసుకొని జగన్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, మరొకరు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. చంద్రబాబు కాంగ్రెసు పార్టీని విమర్శించే ముందు తన సంగతి చూసుకోవాలన్నారు. చంద్రబాబుతో వేలెత్తి చూపించుకునే స్థితిలో కాంగ్రెసు ప్రభుత్వం లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. 2014 వరకు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారని, తాను పిసిసి చీఫ్‌గా ఉంటానన్నారు.

వైయస్‌కు శత్రువులు అయిన చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో జగన్ కుమ్మక్కయ్యారన్నారు.  26 జివోలకు కెబినెట్‌దే బాధ్యత అన్నారు. జగన్ ను సిఎం చేయొద్దన్న సోనియా నిర్ణయం ఇప్పుడు కాంగ్రెసుకు మంచి చేస్తుందన్నారు. జగన్‌ను సిఎం చేయాలని సంతకాలు చేసినందుకు ఇప్పుడు తాము పశ్చాత్తాప పడుతున్నామన్నారు. ఆయనను సిఎం చేసి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెసు తీవ్రంగా నష్టపోయేదన్నారు.

జగన్‌కు సానుభూతి వస్తుందని చట్టం అమలు చేయకుండా ఉంటాలా అని ప్రశ్నించారు. జగన్ ఆక్రమాస్తుల కేసులో సంబంధం ఉన్న వారు జైళ్లకు వెళ్లక తప్పదన్నారు. జగన్‌కు చెందిన సాక్షి మీడియాకు ప్రకటనల నిలిపివేతపై హైకోర్టులో స్టే వచ్చినంత మాత్రాన తన మాట మారదన్నారు. ప్రకటనల నిలిపివేత నిర్ణయం సమర్థనీయమే అన్నారు.

చంద్రబాబు, జగన్‌ల విమర్శలు విడ్డూరమని మరో నేత తులసీ రెడ్డి అన్నారు. అబద్దాలతో సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారన్నారు. సాక్షికి ప్రకటనలు నిలిపివేయడానికి 403 జివో చాలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్య పూర్వకంగా వార్తలు రాస్తే ప్రకటనలు ఆపొచ్చన్నారు. ఆయనపై కాంగ్రెసుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదన్నారు. సిబిఐ చట్ట ప్రకారమే నడుచుకుంటుందన్నారు. జగన్ ఓ పిరికి పంద అన్నారు. మీడియాను అఢ్డు పెట్టుకొని రక్షణ పొందాలని జగన్ చూస్తున్నాడన్నారు.