శంకర్, విక్రమ్ సినిమా ‘ఎలక్షన్'?

శంకర్, విక్రమ్ సినిమా ‘ఎలక్షన్'?

'స్నేహితుడు' చిత్రం తర్వాత తమిళ దర్శకుడు శంకర్ చేసే సినిమా గురించి గత కొంత కాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన రూపొందించే తదుపరి చిత్రంలో సూర్య కథానాయకుడుగా నటిస్తాడని కొందరు... కాదు, విక్రమ్ కథానాయకుడుగా నటిస్తాడని మరి కొందరూ చెబుతూ వచ్చారు. 

అయితే, శంకర్ మాత్రం ఏమీ చెప్పకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే, తాజాగా అందిన అధికారిక సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. శంకర్ ఈ చిత్రానికి రచయిత సుబ చేత స్క్రీన్‌ప్లే, మాటలు రాయిస్తున్నాడట. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ ఇప్పటికే రెండు ట్యూన్లు కూడా కంప్లీట్ చేశాడని తెలుస్తోంది.

సమకాలీన రాజకీయాల నేపథ్యంలో శంకర్ గతంలో ‘ఒకేఒక్కడు' చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. మళ్లీ చాలా కాలం తర్వాత ఆయన మరోసారి రాజకీయాల నేపథ్యంలో ఓ భారీ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడని చెన్నై సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి తమిళంలో ‘తేర్‌ధాల్', తెలుగులో ‘ఎలక్షన్' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. గతంలో శంకర్-విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అపరిచితుడు' సినిమా సూపర్ హిట్టయిన సంగతి మనకు తెలిసిందే!