పెళ్లి రైట్స్ అమ్ముకున్న స్నేహ!

పెళ్లి రైట్స్ అమ్ముకున్న స్నేహ!

హీరోయిన్ స్నేహ తన ప్రియుడు ప్రసన్నతో ఈ నెల 11న పెళ్లి ద్వారా ఏకం అవుతున్న సంగతి తెలిసిందే. స్నేహ పెళ్లి కార్యక్రమం ప్రముఖ తమిళ టీవీ ఛానల్ విజయ్ టివిలో లైవ్ టెలికాస్ట్ కానుంది. ఈ మేరకు సదరు టీవీ ఛానల్ టెలికాస్ట్ రైట్స్‌ను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. తమ పెళ్లి రైట్స్‌ను అమ్ము కోవడం ద్వారా స్నేహ-ప్రసన్నలు దక్షిణాదిన కొత్త సంప్రదాయానికి తెరతీశారు. 

ఈ దెబ్బతో మున్ముందు ఇతర సెలబ్రిటీలు కూడా తమ పెళ్లి కార్యక్రమాలకు రేటు కట్టి అమ్ముకునే సంప్రదాయానికి దారి చూపినట్లయింది. ఈ పెళ్లి కార్యక్రమం తమిళ నాట ఉన్న సినీ ప్రేమికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్నేహ అభిమానులు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీఆర్పీ రేటింగులు భారీగా పెరుగుతాయని సదరు టీవీ ఛానల్ ఆశిస్తోంది.

'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి ద్వారా ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో తాము పెళ్లి చేసుకుంటున్నామని స్నేహ, ప్రసన్నలు తెలిపారు. పెండ్లి తర్వాత నటించే విషయమై స్నేహదే తుది నిర్ణయమని ప్రసన్న పేర్కొనగా, తానింకా దానిపై ఆలోచించలేదని స్నేహ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

చెన్నయ్‌లోని శ్రీవారి వెంకటాచలపతి కళ్యాణ మండపంలో మే 11, ఉదయం 9 గంటలకు ప్రసన్నతో నటి స్నేహ వివాహం వైభవంగా జరుగుతుందని బంధువులు తెలిపారు.