బాబు రివర్స్ పంచ్

బాబు రివర్స్ పంచ్

 షాకివ్వబోయిన నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా  చంద్రబాబు నాయుడు  రివర్స్ పంచ్ ఇచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో విజయవాడ టిడిపి పట్టణ అధ్యక్షుడు  వల్లభనేని వంశీ  మోహన్ భేటీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ అంశంలో జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు పై చేయి సాధించారని అంటున్నారు.

జగన్, వంశీ కలయిక వెనుక జూనియర్ ఉన్నారనే ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. తనకు భవిష్యత్తులోనూ చంద్రబాబు పార్టీలో రాజకీయ ప్రాధాన్యం కల్పించరనే భావనతో జూనియర్ ఎన్టీఆర్  ఇప్పటి నుండే తన భవిష్యత్తును నిర్దేశించుకునే వ్యూహంలో భాగంగా తన వర్గానికి చెందిన నేతలను పురమాయిస్తున్నారని అంటున్నారు. వంశీ తర్వాత జూనియర్‌కు అత్యంత సన్నిహితుడు అయిన కొడాలి నాని మంత్రి పార్థసారథితో భేటీ కావడం రాజకీయవర్గాల్లో దుమారం రేపింది.

అయితే జూనియర్ వ్యూహాన్ని బాబు సమర్థంగా తిప్పి కొట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తెలంగాణ ప్రాంతంలో నేతలు ఎదురుదాడికి దిగినప్పుడు చంద్రబాబు సెంటిమెంట్ దృష్ట్యా వారిపై చర్యలకు వెనుకాడారు. తమ పైన కూడా బాబు అదే రీతిలో వ్యవహరిస్తారని జూనియర్ వర్గం భావించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌తో భేటీ తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసేంత తీవ్రంగా ఉంటుందని వంశీ భావించి ఉండరనే వాదన వినిపిస్తోంది.

కానీ వెంటనే స్పందించిన అధినేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో షోకాజ్ నోటీసు జారీ చేయించారు. దీంతో వంశీ అవాక్కయ్యారని అంటున్నారు. తమ ప్లాన్‌కు భిన్నంగా బాబు స్పందించారనే భావన వారిలో వ్యక్తమవుతోందట. దీంతో వంశీ దిద్దుబాటు చర్యకు ఉపక్రమించారని అంటున్నారు. జగన్‌తో భేటీ అనంతరం కూడా ఆయన పరిటాల రవీంద్ర హత్య విషయంలో బాబు యువనేతపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని చెప్పారు.

జగన్‌తో కలవడమే కాకుండా, ఆయనను వెనుకేసుకు రావడంపై పార్టీకి తీవ్ర ఆగ్రహం కలిగించింది. వెంటనే షోకాజ్ నోటీసులు వెళ్లాయి. అక్కడ వరకు రాకపోవచ్చునని వారు భావించారట. అంతేకాకుండా జగన్‌తో భేటీ పైన వివరణ ఇచ్చే విషయంలోనూ బాబు పైచేయి సాధించారని అంటున్నారు. తాను నేరుగా అధినేతకే వివరణ ఇస్తానని వంశీ చెప్పినప్పటికీ బాబు మాత్రం అపాయింటుమెంటు నిరాకరించారు.

షోకాజ్ నోటీసును జిల్లా నేతలు జారీ చేసినందున ఆక్కడే వివరణ ఇవ్వాలని, అధినేతను కలవాల్సిన అవసరం లేదని పార్టీ సీనియర్లు వంశీకి కుండబద్దలు కొట్టారట. తనకే వివరణ ఇస్తానన్న వంశీకి బాబు చుక్కలు చూపించారని అంటున్నారు. వంశీ ప్రత్యేకంగా వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చారు. కానీ బాబు నుండి మాత్రం నో రెస్పాన్స్. దీంతో వంశీ వివరణ లేఖ రాసి పంపించాల్సి వచ్చింది.