జూ ఎన్టీఆర్ ‘బాద్ షా' ఫస్ట్ లుక్

జూ ఎన్టీఆర్ ‘బాద్ షా' ఫస్ట్ లుక్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, క్రేజీ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ‘బాద్ షా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మే  20న జూ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మరింత స్లిమ్‌గా ఎనర్జిటిక్ లుక్‌తో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. 

బాద్ షా చిత్రం తొలి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ యూరఫ్‌లో ప్లాన్ చేశారు. ఈ మేరకు యూనిట్ సభ్యులంతా అక్కడి వెళ్లనున్నారు. రెండు నెలల పాటు అక్కడ షూటింగ్ జరుగనుంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ‘బాద్‌షా' సినిమాకు శ్రీనువైట్ల దర్శకుడు. కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రం గురించి దర్శకుడు  శ్రీను వైట్ల  మాట్లాడుతూ... ‘దూకుడు' లాంటి సూపర్‌హిట్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఎన్టీఆర్ చిత్రమంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ అంశాలన్నీ ఇందులో వుంటాయి. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. యాక్షన్‌తో పాటు ఇందులో ఓ అందమైన ప్రేమకథ ఉంటుందని అన్నారు.

ఈచిత్ర షూటింగులో భాగంగా ఇటలీ, నేపాల్‌లలో భారీ చేజింగ్ సీన్లు చిత్రీకరించబోతున్నారు.