స్వామి నిత్యానందకు కోర్టులో ఊరట

స్వామి నిత్యానందకు కోర్టులో ఊరట

 స్వామి నిత్యానందకు తమిళనాడులో మధురై కోర్టులో ఊరట లభించింది. నిత్యానందకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్‌ను) మదురై కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. మదురై ఆధీనం జూనియర్ పీఠాధిపతిగా నిత్యానంద స్వామి నియామకాన్ని వ్యతిరేకించిన కంచి కామకోటి మఠం జయేంద్ర సర్వసతి స్వాములు కోర్టులో పిల్ దాఖలు చేశారు. 

నిత్యానందను జూనియర్ పీఠాధిపతిగా నియమించడం పట్ల కంచి స్వామి అసంతృప్తితో ఉన్నారు. నిబంధనల ప్రకారం నిత్యానంద తలను వెంట్రుకలు లేకుండా క్షవరం చేసుకోలేదనేది ఆయన అభ్యంతరం. మదురై ఆధీనం ఆచారం ప్రకారం పీఠాధిపతులు తప్పకుండా తలపై వెంట్రులు ఉండకూడదు. అదే సమయంలో రుద్రాక్షలు ధరించాలి.

కొన్నాళ్ల క్రితం నిత్యానంద అవాంఛనీయమైన వివాదంలో కూడా చిక్కుకున్నారు. సినీ తారతో నిత్యానంద స్వామి రాసలీలలు జరుపుతున్నట్లు ఉన్న వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. అది నిజమైంది కాదని నిత్యానంద వాదిస్తున్నారు. ఈ వీడియో స్థానిక టీవీ చానెళ్లలో ప్రసారమైంది. నెట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. 

దాంతో  నిత్యానంద  2010 ఏప్రిల్ 21వ తేదీన అరెస్టయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలాన్‌లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు 2010 జూన్ 11వ తేదీన బెయిల్ ఇచ్చింది.