ముందస్తు బెయిల్ కోసం జగన్ పిటిషన్

ముందస్తు బెయిల్ కోసం జగన్ పిటిషన్

విచారణకు పిలిచిన నేపథ్యంలో తనను సిబిఐ అరెస్టు చేస్తుందనే ఉద్దేశంతో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గురువారం ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.  ఉప ఎన్నికలు  జరుగుతున్న నేపథ్యంలో ఉద్దేశ్యపూర్వకంగానే సిబిఐ తనను ఈ నెల 25వ తేదీన విచారణకు పిలిచిందని, తనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని జగన్ ఆ పిటిషన్‌లో అన్నారు. 

ఎన్నికల ప్రచారంలో తనను అడ్డుకునేందుకు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. తాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అధ్యక్షుడనని ఆయన అన్నారు. వైయస్ జగన్ తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వాదనలను ప్రారంభించారు. తనకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. సిబిఐ విచారణకు తాను భయపడబోనని, తాను విచారణకు హాజరవుతానని, తన పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 

రాజకీయ దురుద్దేశంతో తాము విచారణ జరపడం లేదని, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ సాగుతోందని సిబిఐ అంటోంది. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డి కస్టడీ ఈ నెల 28వ తేదీ వరకే ఉందని, వారి సమక్షంలో వైయస్ జగన్‌ను విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే తాము వైయస్ జగన్‌ను పిలిచామని సిబిఐ అంటోంది. 

కాగా, వరుసగా రెండో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సిబిఐ విచారణకు గురువారం హాజరయ్యారు.  వైయస్ జగన్  ఆస్తుల కేసులో అరెస్టు చేసిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానంద రెడ్డిలతో కలిపి మోపిదేవిని సిబిఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణను  సిబిఐ  అధికారులు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.