నేనేమైనా హోటల్ నడుపుతున్నానా?

నేనేమైనా హోటల్ నడుపుతున్నానా?

కర్నూలు: నా ఇంట్లో 74 గదులు ఉండటానికి నేనేమైనా హోటల్ నడుపుతున్నానా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. ఇటీవల కిరణ్ తన ఉప ఎన్నికల ప్రచారంలో.. జగన్ ఇంట్లో డెబ్బైకి పైగా గదులున్నాయని, ఎవరైనా అలా కట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.

సిఎం ఈ మధ్య అవినీతి గురించి మాట్లాడుతున్నారని, తన ఇంటి గురించి కూడా మాట్లాడుతున్నారని, ఈ ఇంట్లో 74 గదులు ఉన్నాయట, అలా కట్టుకోవడానికి నేనేమైనా హోటల్ నడుపుతున్నానా అని ప్రశ్నించారు. కిరణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కై తన కులం, మతం, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఇద్దరికీ తాను ఒకటే చెబుతున్నానని, తన మతం మానవత్వమని, పేదవాడి కోసం తపించే, తాపత్రయపడే కులమే నా కులం అన్నారు.

స్వార్థ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారుకు పట్టడం లేదన్నారు. అన్నదాత పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలు అప్పుల ఊబిలో చిక్కుకు పోతున్నారన్నారు.

కాంగ్రెసు, టిడిపి చేస్తున్న నీచ రాజకీయాలను ఎదిరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత కాంగ్రెసు ప్రభుత్వం పేదోడికి ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదని ఆరోపించారు. పాలక, ప్రతిపక్షాలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడటం తప్ప ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయారని ఆరోపించారు. జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.