ఎక్కడైనా ఇకపై ఫ్రీ రోమింగ్ సేవలు : సిబాల్

ఎక్కడైనా ఇకపై ఫ్రీ రోమింగ్ సేవలు :  సిబాల్

కేంద్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త టెలికామ్ విధానానికి ఆమోదముద్ర వేసింది. ఫలితంగా దేశంలో ఎక్కడైనా ఇక ఫ్రీ రోమింగ్ సేవలు అందుబాటులోకి రానున్నట్టు కేంద్ర టెలికామ్ శాఖామంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రోమింగ్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. 

నేషనల్ టెలికామ్ పాలసీ (ఎన్.టి.పి) - 2012కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసిన అనంతరం మంత్రి సిబాల్ మీడియాతో మాట్లాడుతూ కొత్త టెలికామ్ విధానం ప్రకారం ఒక దేశ ఒకే లైసెన్స్‌ ఉంటుందన్నారు. దీనివల్ల గ్లోబల్ హబ్‌గా భారత్ మారుతుందన్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాలకు కూడా టెలికామ్ లింకులు కల్పిస్తామన్నారు. 

ఈ విధానం వల్ల మొబైల్ వినియోగదారుల నుంచి రోమింగ్ ఛార్జీలు టెలికామ్ కంపెనీలు వసూలు చేయబోవన్నారు. ఈ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో దేశంలో ఎక్కడైనా ఇకపై ఫ్రీ రోమింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని, దీనివల్ల మొబైల్ వినియోగదారుడు ఒక మొబైల్ నంబరును దేశ వ్యాప్తంగా వినియోగించుకోవచ్చని, పైపెచ్చు.. మొబైల్ పోర్టబులిటీ సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.