నష్టాల బాటలో ఆర్టీసీ

నష్టాల బాటలో ఆర్టీసీ

నష్టాల నుంచి గట్టేక్కేందుకు సర్కారు శీతకన్ను విధించడంతో యాజమాన్యం మంచి ప్లాన్ వేసింది. అమ్మ పెట్టదు..అడుక్కుతిననివ్వకపోతే ఎలా అంటూ ఆర్టీసి ఆస్తులను బ్యాంకుల్లో కుదవపెడుతున్నారు. సంస్థ ఆస్తుల్లో కొన్ని బ్యాంకుల్లో తనాఖా పెట్టారు. ఇంతకాలం నష్టాలనుంచి ఎలా గట్టెక్కుతున్నారంటే ఏమి సమాధానాలివ్వని అధికారుల బండారం టీవి5 బట్టభయలుచేసింది. తనఖా పెట్టిన ఆస్తుల వివరాలను సంపాదించింది.

ఆర్టీసీకి ప్రతి ఏడాది నష్టాలు వస్తున్నా సంస్థను నడుపుతున్నామని అధికారులు ఘనంగా చెబుతున్నారు. నష్టాలకు సంబంధించి రాష్ట్రసర్కార్‌కు నివేదికలు సంస్థ ఇస్తున్నా సాయం మాత్రం అందలేదు. ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకున్నా ప్రతి నెల 50 కోట్ల రూపాయల నష్టాన్ని సంస్థ ఎలా భరిస్తోందనే అంశంపై టీవీ పైవ్ కూపి లాగింది. 

ఈ గుట్టులో ఆర్టీసికి ఉన్న వేలాది కోట్ల విలువ చేసే స్థలాలను గుట్టు చప్పుడు కాకుండా తనఖా పెడుతున్నట్లు తేలింది. టీవీ ఫైవ్ సేకరించిన సమాచారంలో కొన్ని ఆస్తుల తనఖా వివరాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 12 చోట్ల ఉన్న విలువైన స్థలాలను బ్యాంకుల్లో వేయి కోట్లకు తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్, పికెట్ డిపోలను 150 కోట్ల రూపాయలకు తనాఖా పెట్టారు. ఉప్పల్ గ్యారేజీ 250 కోట్లు, బర్కత్ పురా సిటీ డిపో, ముషిరాబాద్ రెండు డిపోలు కలిపి 125 కోట్లకు తనఖా పెట్టారు. జీడిమెట్ల, హయత్ నగర్ డిపోలు 100 కోట్లు, దిల్ షుఖ్ నగర్, గుంటూరు బస్టాండ్‌లు 100 కోట్లు, విజయవాడ నెహ్రూ బస్టాండ్‌ను 100 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారు.

ప్రధాన ఆర్టీసీ డిపో స్థలాలను తనఖా పెట్టడాన్ని యాజమాన్యం సమర్థిస్తోంది. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులకు భద్రత కోసం తాకట్టు పెట్టామనే వాదనను సంస్థ చెబుతోంది. సంస్థ గుట్టును టీవీ ఫైవ్ బుట్టదాఖలు చేయడంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బ్యాంకుల్లో ఉన్న ఆస్తులను విడిపించకపోతే సమ్మెలకు సైతం వెనుకాడమని హెచ్చరిస్తున్నారు. 

అప్పుల సాకుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాగే సంస్థ నడిస్తే మరికొన్ని రోజుల్లో దివాళా తీయడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర సర్కార్ సకాలంలో మేల్కోని సాయం అందించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి.