సిఎంకు 33 రోజులేనన్న శంకర్

సిఎంకు 33 రోజులేనన్న శంకర్

 మాజీ మంత్రి శంకరరావు మీడియా సమావేశాలను నిరోధించడానికి కాంగ్రెసు శానససభా పక్షం (సిఎల్పీ) కార్యాలయానికి గురువారం తాళం వేశారు. దీంతో సోనియా గాంధీకి జై అంటూ నినాదాలు చేస్తూ శంకరరావు కార్యాలయం ద్వారం వద్ద కూర్చున్నారు. పార్టీకి వ్యతిరేకంగా శంకరరావు మాట్లాడుతున్నారనే ఆరోపణతో సిఎల్పీ కార్యాలయానికి తాళం వేశారు. తాను క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదని శంకరరావు చెప్పారు. సిఎల్పీ కార్యాలయం ద్వారం వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

వచ్చే నెల 12వ తేదీ తర్వాత రాష్ట్రానికి శనిపోతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇక 33 రోజులే ఉన్నాయని, ఆ తర్వాత పరిస్థితిని మీరే చూస్తారని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికుల వస్తాయా అని అడిగితే నేను మాట్లాడుతున్నాను కదా, నన్ను మాట్లాడనీయండి అని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమంగా సంపాదించిన సొమ్మును పేదల కోసం, మంచిపనులకు ఖర్చు చేయాలని ఆయన సూచించారు. ఇది మాట్లాడడానికే తాను సిఎల్పీకి వచ్చానని ఆయన చెప్పారు. తండ్రి, తాత పేర్ల మీద స్మారకాలను నిర్మించి, మంచి పనులు చేస్తే జగన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. 

సిఎల్పీ కార్యాలయానికి తాళం వేయడంలో ప్రధాన పాత్ర పోషించిన శానససభ్యుడు కెఎల్ఆర్ (కె. లక్ష్మారెడ్డి)పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కెఎల్ఆర్ అనేదాన్ని డీకోడ్ చేస్తే చాలా పెద్దగా ఉంటుందని, మరోమారు చెప్తానని ఆయన అన్నారు. కెఎల్ఆర్ ఘనత ఏమిటి, పార్టీలు మారిన వ్యక్తి అని ఆయన అన్నారు. పార్టీకి విధేయంగా ఉంది ఎవరని ఆయన అడిగారు. తెలంగాణ వీరాధివీరులు, శూరులు పరకాలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన సవాల్ చేశారు. రజనీకాంత్ రోబోలని వారిని ఆయన అభివర్ణించారు. 

తాను క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడలేదని ఆయన అన్నారు. సిఎల్పీ కార్యాలయానికి తాళం వేసి తన హక్కును కాలరాసిన సంఘటనపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి నామినేట్ అయ్యారని, నామినేట్ అయిన వారికి ఏం అధికారం ఉంటుందని ఆయన అన్నారు. నామినేట్ అయ్యారని మీరు ఒక్కరే అంటున్నారని మీడియా ప్రతినిధులు అంటే, 33 రోజులుంది, అప్పుడు తెలుస్తుందని అన్నారు. 

ఉప ఎన్నికల్లో వాళ్లంతా కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించి రావాలని, లేకుంటే నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు శానససభ్యులు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లోకి ఎందుకు వెళ్లడం లేదని, మంత్రులు ఎందుకు ప్రచారం చేయడం లేదని ఆయన అన్నారు. తనది తప్పని అంటే తాను తప్పుకుంటానని ఆయన అన్నారు. తన హక్కులకు భంగం కలిగించినందుకు సోనియా వద్దకు వెళ్తానని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని బతికించడం, పార్టీని నాశనం చేసేవారి గుండెల్లో నిద్రపోవడం తన కార్యక్రమమని ఆయన అన్నారు. తాను చివరి వరకు కాంగ్రెసువాదిగానే ఉంటానని, సోనియా నాయకత్వాన్ని బలపరుస్తానని ఆయన చెప్పారు. 

సిఎల్పీ కార్యాలయంలో మీడియా గదికి తాళం వేస్తే తాను పగులగొడతానని  శంకరరావు  బుధవారం హెచ్చరించారు. అయితే, కార్యాలయానికి చెప్పినట్లుగా తాళం వేసి ఉండడంతో మెట్ల మీద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.