జగన్ ఓటు చేస్తారా?

 జగన్ ఓటు చేస్తారా?

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ అనివార్యం కావడంతో వోటింగ్ అవసరం ఏర్పడుతోంది. యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి పోటీగా పిఎ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. సంగ్మాకు బిజెపి మద్దతిస్తోంది. ఈ స్థితిలో జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది.

జగన్ అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు. ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయాలని ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి జగన్‌కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు ఆయన ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జగన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన రాష్ట్ర శానససభ ఆవరణలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగబద్దంగా లోకసభకు ఎన్నికైన నాయకుడు కాబట్టి వైయస్ జగన్‌కు ఓటు వేసే హక్కు ఉంటుందని అంటున్నారు.

వైయస్ జగన్ బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు పోలింగ్ జరిగే లోగా బెయిల్ వస్తే ఫరవా లేదు. బెయిల్ రాకపోతే ఆయన చంచల్‌గుడా జైలు నుంచి శానససభకు వెళ్లి ఓటు వేసి తిరిగి చంచల్‌గుడా జైలుకు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. జైలు అధికారులు ఆయనను ఆసెంబ్లీకి తీసుకుని వెళ్లి మళ్లీ జైలుకు తీసుకుని రావాల్సి ఉంటుందని అంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్ జగన్ ఎవరికి మద్దతిస్తారనే విషయాన్ని ఇంకా తేల్చలేదు. బిజెపి బలపరుస్తున్నందున సంగ్మాకు ఓటు చేయడం ఆయనకు కష్టంగానే ఉంటుంది. అదే సమయంలో ప్రణబ్ ముఖర్జీని బలపరిస్తే కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు బలం చేకూరుతుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు కోరడానికే ఇటీవల మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ జగన్‌ను జైలులో కలుసుకున్నట్లు చెబుతున్నారు. తాత్కాలిక అవగాహనలో భాగంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.