15 వరకు టెన్షన్ బడా నేతలకే

 15 వరకు టెన్షన్ బడా నేతలకే

 ప్రస్తుత ఉప ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భవిష్యత్తును మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు  చిరంజీవిభవిష్యత్తును కూడా తేల్చనున్నాయి. అలాగే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి భవిష్యత్తు రాజకీయ వ్యూహం కూడా ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. దీంతో పోటీ చేసిన అభ్యర్థుల కన్నా రాష్ట్రంలోని అగ్రనేతలకే ఫలితాలపై ఎక్కువ ఉత్కంఠ ఉందని చెప్పవచ్చు.

ఈ నెల 15వ తేదీన అందరి జాతకాలు బయటపడనున్నాయి. అప్పటి వరకు అభ్యర్థుల జాతకాలు ఇవియంల్లో భద్రంగా ఉంటాయి. ఈ నెల 15వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు వెలువడడంతోనే రాష్ట్ర నాయకులు తమ భవిష్యత్తు ప్రణాళికలకు పదును పెట్టవచ్చు. కొంత మంది నాయకులు పునరాలోచనలో పడవచ్చు. తమ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనకు గురి కావచ్చు. మొత్తం మీద ఉప ఎన్నికలు రాష్ట్ర అగ్ర నేతల భవిష్యత్తుకు పరీక్ష పెడుతున్నాయి.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనే అంచనా ఉన్నప్పటికీ కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నా మెరుగ్గా ఉందా లేదా అనేది, అసలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గానీ తెలుగుదేశం పార్టీకి గానీ ఏ మేరకు పోటీ ఇవ్వగలిగిందనే విషయాలపై కూడా ఆ పార్టీ రాష్ట్ర నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉండవచ్చు.

వరుస ఉప ఎన్నికలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని రాజకీయ నేతలు చెప్పినప్పటికీ సాధారణ ఎన్నికల్లో కన్నా ఈ ఉప ఎన్నికల్లో చాలా స్థానాల్లో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో 86.53 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇది రికార్డు. 2009 ఎన్నికల్లో 80.66 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో కన్నా ఆరు శాతం పోలింగ్ ఎక్కువ జరిగింది.

అత్యల్పంగా తిరుపతిలో ఓటింగ్ శాతం నమోదైంది. అయితే ఇది సాధారణ ఎన్నికల్లో కన్నా ఎక్కువే. తిరుపతి నియోజకవర్గంలో 55 శాతం ఓట్లు పోలయ్యాయి. 2009 ఎన్నికల్లో 51 శాతం పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. పరకాలలో 84 శాతం, నరసన్నపేటలో 74 శాతం, పాయకరావుపేటలో 82 శాతం, నర్సాపురం 79 శాతం, పోలవరంలో 75 శాతం, ఎమ్మిగనూరులో 77 శాతం, రాయదుర్గంలో 82 శాతం, మాచర్లలో 81 శాతం, ఒంగోలులో 82 శాతం, ఉదయగిరిలో 77 శాతం, రాజంపేటలో 79 శాతం, రైల్వే కోడూరులో 74 శాతం, రాయచోటిలో 80 శాతం, అనంతపురం అర్బన్‌లో 66 శాతం, ప్రత్తిపాడులో 76 శాతం ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు లోకసభ స్థానానికి 68 శాతం ఓట్లు పోలయ్యాయి.