లక్ష్మినారాయణకు నేతల బాసట

లక్ష్మినారాయణకు నేతల బాసట

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్, పత్రిక రెండూ బోగస్ అని ప్రభుత్వ విప్, కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఎవరితోనైనా మాట్లాడవచ్చని, ఆయనతో ఎవరైనా మాట్లాడుతారాని ఆయన శుక్రవారం మెదక్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు సీబీఐ జేడీతో మాట్లాడటంలో తప్పుకాదని ఆయన అన్నారు.

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ నిజాయితీగల అధికారి అని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. విచారణను నీరుగార్చేందుకే లక్ష్మినారాయణపై తప్పుడు అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షి దుష్ప్రచారం చేస్తోందని ఆయన శుక్రవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. వార్తల సేకరణ కోసం మీడియా ప్రతినిధులు ఎవరితోనైనా మాట్లాడటం సహజం అని తెలిపారు. సాక్షి అకౌంట్ల ఫ్రీజ్‌పై మాట్లాడిన జర్నలిస్టు నేతలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని యనమల ప్రశ్నించారు.

రాజకీయ అవినీతిపై విచారణ జరుపుతున్న సిబిఐ జెడి లక్ష్మీనారాయణకు ఎవరితోనైనా మాట్లాడే హక్కు ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. జర్నలిస్టులను, సిబిఐని తప్పుబట్టడం సరికాదని, ఫోన్లో మాట్లాడినంత మాత్రాన తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సిబిఐ జెడి లక్ష్మినారాయణ విచారణను తప్పుబట్టడం విలువలను దిగజార్చుకోవడమే అని నారాయణ అభిప్రాయపడ్డారు.

సిబిఐ జెడి మీడియా ప్రతినిధులతో మాట్లాడడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమర్థించారు. లక్ష్మినారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడడాన్ని తప్పు పట్టడం సరి కాదని ఆయన శుక్రవారం విశాఖపట్నంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.