జగన్ మామూలు నేరస్తుడు కాదు

జగన్ మామూలు నేరస్తుడు కాదు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరో రెండు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) పిటిషన్ పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇరువైపుల వాదనలను శుక్రవారం విన్నది. అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మరికొద్దిసేపట్లో తీర్పును వెల్లడించే అవకాశముంది. ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఐదు రోజుల విచారణలో సిబిఐ జగన్‌ను వేధించలేదన్నారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరిగిందని చెప్పారు.

వైయస్ జగన్ అక్రమాలపై వివరాలను పూర్తిగా సేకరిస్తున్నామని చెప్పారు. జగన్‌ను ఎన్ని రకాలుగా ప్రశ్నించినా వేరే వాళ్ల పైకి నెపం నెడుతున్నారని చెప్పారు. జగన్‌కు వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో సాక్షులు ముందుకు వచ్చారన్నారు. దర్యాఫ్తులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా జగన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించారని తెలిపారు. మరో రెండు రోజుల పాటు జగన్‌ను తమ కస్టడీకి అప్పగిస్తే దర్యాఫ్తులో వెలువడిన అంశాల వివరాలు పూర్తిగా తెలిసే అవకాశముందన్నారు.

జగన్ కస్టడీ కోరడం తమకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని సిబిఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జగన్ మామూలు నేరస్తుడు కాదని, విచారణకు సహకరించడం లేదన్నారు. ఐదు రోజుల కస్టడీలో చాలామంది సాక్ష్యులను విచారించామన్నారు. జగన్‌ను ఎన్నిసార్లు ప్రశ్నించినా పొంతన లేని సమాధానాలు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు విదేశాలలో నేరం జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు. విదేశీ కంపెనీల నుంచి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఆరా తీయాల్సి ఉందన్నారు.

తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డితో కలిసి కుట్ర పన్నారన్నారు. పెట్టుబడుల అక్రమాలపై ఆధారాలు ముందు పెట్టి జగన్‌ను ప్రశ్నించినా సమాధానం దాట వేశారన్నారు. పొంతన లేని సమాధానాలు ఇచ్చారన్నారు. విచారణలో చాలా తెలివిగా సమాధానాలు చెబుతున్నారని తెలిపారు. విదేశీ కంపెనీల నుంచి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఆరా తీయాల్సి ఉందన్నారు.