కాంగ్రెసు రాజకీయాల్లో మూడు ముక్కలాట

 కాంగ్రెసు రాజకీయాల్లో మూడు ముక్కలాట

రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాల్లో మూడు ముక్కలాట రసకందాయంలో పడినట్లు కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు నియోజకకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి రెచ్చిపోవడానికి సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. ఆయన శుక్రవారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీలో తీవ్ర చర్చను లేవనెత్తుతున్నాయి.

రామచంద్రాపురం, నర్సాపురం సీట్లలో ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చినవారే కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అది చిరంజీవికి కలిసి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయన పార్టీలో ఆధిపత్యంలోకి రావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాదని కాంగ్రెసు పెద్దలు డిసైడ్ అయిపోయారని, అందుకే కష్టపడి పనిచేయడం లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెసు అధిష్టానాన్ని ఉద్దేశించి మాత్రం ఆయన అనలేదనేది స్పష్టం. మరి, ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ప్రశ్న.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఉద్దేశించి మాట్లాడారా అనేది తెలియడం లేదు. ఇద్దరిని ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని కూడా అంటున్నారు. పార్టీలో సమన్వయ లోపం ఉందని కూడా ఆయన అన్నారు. సమన్వయం చేయాల్సింది కిరణ్, బొత్సలే కాబట్టి వారిద్దరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కానీ, ఆయన నిర్దిష్టంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీలక భూమిక పోషించారు. రాజంపేట వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై, తిరుపతి వంటి స్థానాల్లో స్థానిక నాయకులు సహకరించకపోవడంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మంత్రి గల్లా అరుణ కుమారి సహకరించకపోవడాన్ని ప్రధానంగా చెబుతున్నారు. 

తనకు బాధ్యత అప్పగిస్తే పార్టీని 2014లో పార్టీని విజయపథంలో నడిపిస్తాననే సంకేతాలను కూడా ఆయన ఇచ్చారు. తనకు అప్పగిస్తే చేసి చూపిస్తానని ఆయన అన్నారు. దీన్నిబట్టి ఆయన రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వాన్ని బేషరతుగా ఆశిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్న సమయంలో చిరంజీవి రామచంద్రాపురం కార్యకకర్తలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెసు సంప్రదాయ ఓటర్లంతా జారిపోయారని, ప్రజారాజ్యం కార్యకర్తలు, తన అభిమానులు మాత్రమే పార్టీ వెంట ఉన్నారనే విషయాన్ని కూడా ఆయన కొంత స్పష్టంగానే చెప్పారు. ఏమైనా, కాంగ్రెసు వర్గపోరు రంజుగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.