సమయం పడుతుంది: టిజి వెంకటేష్

సమయం పడుతుంది: టిజి వెంకటేష్

పార్టీపై  రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు నాయకులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. ఉప ఎన్నికల్లో రెండు శానససభా స్థానాల్లో కాంగ్రెసు ఓటమికి సహకరించిన చాలా మంది ప్రజల్లో చిరంజీవి ఒక్కరని మాజీ మంత్రి, సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించగా, కాంగ్రెసు సంస్కృతికి అలవాటు పడేందుకు చిరంజీవికి సమయం పడుతుందని చిన్న  నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ అన్నారు.

నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో కాంగ్రెసు అభ్యర్థులు విజయం సాధించడానికి చిరంజీవి ఒక్కరే కారణం కాదని, విజయానికి చాలా మంది ప్రజలు సహకరించారని, ఆ ప్రజల్లో చిరంజీవి ఒక్కరని  జెసి దివాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు సంస్కృతికి అలవాటు పడడానికి చిరంజీవికి సమయం పడుతుందని టిజి వెంకటేష్ అన్నారు. ఒక పార్టీ మరో పార్టీలో విలీనమైనప్పుడు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

చిరంజీవి తీరును కాంగ్రెసు సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు తప్పు పట్టారు. చిరంజీవి తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెసు కార్యకర్తలను గాయపరిచారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలవడానికి సమిష్టి కృషి కారణమని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. చిరంజీవి వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన అన్నారు. చిరంజీవి తన తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా సమస్యలుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెప్పుకోవాలని ఆయన చిరంజీవికి సూచించారు. కాంగ్రెసు వ్యక్తుల మీద ఆధారపడిన పార్టీ కాదని ఆయన అన్నారు.