వాస్తు దోషంతో 'గాలి' కుటీరం తొలగింపు

 వాస్తు దోషంతో 'గాలి' కుటీరం తొలగింపు

 కర్నాటక  మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్ డి ఇంటి ఆవరణలో నిర్మించుకున్న రాజకీయ కుటీరానికి వాస్తుదోషం ఉందనే ప్రచారం సాగడంతో రాత్రికి రాత్రే దానిని తొలగించినట్లుగా సమాచారం. తనకు కాలం కలిసి రాకపోవడానికి వాస్తు లోపమే కారణమని గాలి జనార్దన రెడ్డి కూడా భావించినట్లున్నారు. అనుకున్నదే తడవుగా తన కుటీరంలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంధ్ర భవనాన్ని తలపించే గాలి నివాసం వెలుపల 58 అడుగుల వెడల్పు, 101 అడుగుల పొడవు గల ఓ కుటీరముంది.

 

దానిని మొత్తం వెదురు దిబ్బలు, టేకు కర్రలు, గడ్డితో నిర్మించారు. ఎంతో ఇష్టంతో గాలి ఈ కుటీరాన్ని తనకు నచ్చినట్లు కట్టించుకున్నారు. దీని కోసం సుమారు 500 టన్నుల టేకు ఉపయోగించినట్టు అంచనా. ఇక్కడ గడపడం గాలికి ఎంతో ఇష్టం. ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలైనా ఇక్కడే నిర్వహించడం పరిపాటి. అయితే ఆయన జైలుకు వెళ్లాక ఈ కుటీరం కళ తప్పింది. పైగా వాస్తు దోషముందని భావించి కుటీరంలోని బాత్‌రూంను, టాయిలెట్‌ను కూల్చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గాలి విడుదల కావాలని కోరుకుంటూ ఇప్పటికే పలు రకాల పూజలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వాస్తు దోషం పేరిట కుటీరంలో కొన్ని మార్పులు చేయడం ప్రారంభించారు. అయితే ఈ కుటీరంలో నేలమాళిగలు ఉన్నట్లు సిబిఐ అనుమానిస్తోంది. ప్రస్తుతం కుటీరంలో కొంత భాగాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఇది భవనానికి కుడి వైపున ఉంది.

కుటీరానికి వినియోగించిన టేకు మొత్తాన్ని విదేశాల నుంచి ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకుని ఇక్కడికి లారీల ద్వారా తరలించినట్లు సిబిఐ కూడా గుర్తించింది. ఇందులో సుమారు 400 మంది కూర్చునేందుకు వీలుగా ఒక హాలు, విశ్రాంతి తీసుకునేందుకు రెండు బెడ్ రూంలు, ఒక రహస్య గది, టాయిలెట్, బాత్‌రూం ఉన్నాయి. వాస్తు దోషం పేరిట ఇప్పటికే గాలి ఇంటి ప్రవేశ ద్వారాన్ని కూల్చివేసి మరో వైపునకు మార్చిన విషయం తెలిసిందే.