చంద్రబాల ఫిర్యాదు, కేసు నమోదు

 చంద్రబాల ఫిర్యాదు, కేసు నమోదు

 సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కాల్ లిస్ట్ వెల్లడిపై లీడ్ ఇండియా కార్యకర్త, ఐబిఎం ఉద్యోగిని వాసిరెడ్డి చంద్రబాల మంగళవారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక విలేకరి పైన, నాచారం సిఐ శ్రీనివాస్ రావు పైన ఈ కేసు నమోదయింది.

వారి పైన ఐపిసి 120బి 505, 509, ఐటి చట్టం 66, 72, సమాచార సాంకేతిక చట్టం, భారతీయ టెలిగ్రాఫ్ చట్టం తదితర సెక్షన్ల క్రింద, అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. చంద్రబాల ఫిర్యాదు చేశారని, విచారణ జరిపిస్తామని సిపి ద్వారకా తిరుమల రావు చెప్పారు. విచారణ బాధ్యతను సైబర్ క్రైం ఎసిబికి అప్పగించినట్లు చెప్పారు. ఎసిబి స్థాయి అధికారులచే విచారణ జరిపిస్తున్నామన్నారు.

చంద్రబాల ఫిర్యాదుతో తదుపరి చర్యలకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. నిందితులను అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు. మరోవైపు సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ కూడా తన కాల్ లిస్ట్ బహిర్గతంపై ఫిర్యాదు చేసే అవకాశముందని తెలుస్తోంది. సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసేందుకు సిబిఐ ఉన్నతాధికారులు జెడికి అనుమతిచ్చినట్లుగా తెలుస్తోంది. వారు అనుమతివ్వడంతో ఆయన కూడా ఏ క్షణంలోనైనా ఫిర్యాదు చేసే అవకాశముందని అంటున్నారు.

కాగా కాల్ లిస్టు కేసుకు సంబంధించిన కేసులో పోలీసులు నాచారం పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్ హార్డ్ డిస్కును స్వాధీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నాచారం సిఐ శ్రీనివాస రావు, రైటర్ వాంగ్మూలాలను తీసుకున్నారు. కాగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సిబిఐ జెడి కాల్ లిస్టును విడుదల చేసిన విషయం తెలిసిందే.