డికె అరుణపై తగ్గని మంద

డికె అరుణపై తగ్గని మంద

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెసు నేతల మధ్య వివాదం ముదురుతోంది. పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం... మంత్రి డికె అరుణపై మరొకసారి విరుచుకుపడ్డారు. మంగళవారం మంద వర్గీయులు అరుణపై, అరుణ వర్గీయులు మంద పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంగళవారం మంద జగన్నాథం మాట్లాడుతూ.. తాను డికె అరుణపై పెట్టిన కేసును ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

తన నియోజకవర్గానికి రావొద్దని అరుణ భర్త తనను బెదిరించారని జగన్నాథం ఆరోపించారు. అరుణ కారణంగానే గత ఉప ఎన్నికలలో కాంగ్రెసు ఘోర పరాజయం చవి చూసిందన్నారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితితో కుమ్మక్కు కాలేదన్నారు. తనపై దాడికి అరుణ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అరుణపై కేసును ఉపసంహరించుకోమని ఎవరు చెప్పినా తాను వినేది లేదని చెప్పారు.

మందా జగన్నాథం, డికె అరుణకు మధ్య చెలరేగిన వివాదం నిన్నటి వరకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తలనొప్పిగా మారగా.. ఇప్పుడు కిరణ్‌కు మారింది. వారిని చల్లబర్చేందుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ గొడవ సద్దుమణగలేదు. అయితే ఆదివారం జరిగిన ఘర్షణకు కారణమైన ఎమ్మెల్సీ విష్ణువర్థన్‌పై చర్య తీసుకుంటే ఫిర్యాదును వెనక్కి తీసుకునే సంగతి ఆలోచిస్తానని మందా జగన్నాథం సోమవారం చెప్పారు.

దీనితో సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. మంత్రి అరుణ దళిత వ్యతిరేకి అంటూ, తనపై హత్యాయత్నానికి పురిగొల్పారంటూ మందా జగన్నాథం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాన్ని ఉప సంహరించుకోవాలని సోమవారం ఉదయం బొత్స ఆయనకు ఫోన్ చేశారు. ఆ విషయాన్ని మందా జగన్నాథం నిర్థారిస్తూ, విష్ణువర్థన్‌పై చర్య తీసుకుంటే ఫిర్యాదు ఉప సంహరణ గురించి ఆలోచిస్తానని మీడియా ప్రతినిధులతో చెప్పారు.

మరోవైపు ఈ ఘటనపై బొత్స సత్యనారాయణ నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటు చేశారు. సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఆయన డిసిసి అధ్యక్షుడిని ఆదేశించారు. డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఒబేదుల్లా కొత్వాల్ ప్రమాణ స్వీకారానంతరం ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా మంత్రి డికె అరుణ, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

మందా జగన్నాథంకు మద్దతుగా చేరిన కార్యకర్తలను ఎమ్మెల్సీ విష్ణువర్థన్ అడ్డుకోవడంతో తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారింది. అనంతరం జగన్నాథం ఎస్పీని కలిసి మంత్రి డికె అరుణపై ఫిర్యాదు చేశారు. అరుణను దళిత వ్యతిరేకిగా అభివర్ణిస్తూ ఆమె తనపై హత్యాప్రయత్నం చేయించినట్లు ఆరోపించారు.

కాగా మరోవైపు మంత్రులు గల్లా అరుణ కుమారి, ఏరాసు ప్రతాప్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఓ ప్రయివేటు వ్యక్తికి సున్నపురాయి నిక్షేపాల కేటాయింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఇద్దరు మంత్రులకు నోటీసులు జారీ చేసింది.