జగన్‌పై పార్టీలో స్పష్టత రావాలి

 జగన్‌పై పార్టీలో స్పష్టత రావాలి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేరు చేసి చూసే విషయంలో కాంగ్రెసు పార్టీలో ఓ స్పష్టత రావాల్సిన ఆవశ్యకత ఉందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు సోమవారం అన్నారు. తండ్రి మంచోడని, అలాగే కొడుకు కూడా మంచోడని అనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అలా అభిప్రాయపడుతున్న కాంగ్రెసు నేతలు ఈ వైఖరి మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలో ఫలితాలపై కాంగ్రెసు పార్టీలో అంతర్గతంగా మేథోమథనం జరగాలని విహెచ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సమన్వయ కమిటీ ప్రయత్నిస్తోందని చెప్పారు. అజెండా లేకుండా కేవలం సానుభూతినే నమ్ముకున్న జగన్ పార్టీకి ఇకపై ఓట్లు పడవని చెప్పారు.

విహెచ్ ఆదివారం    చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. వారిద్దరు ఇప ఎన్నికల ఫలితాలపై చర్చించారు. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత పైన కూడా చర్చించారు. కాగా చిరంజీవి ఉప ఎన్నికలపై తన నివేదికను ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లనున్న విషయం తెలిసిందే.

ఉప ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ శ్రేణులను కాంగ్రెసు నేతలు సమన్వయం చేయక పోవడం వల్లనే పదిహేను స్థానాలలో ఓటమి చెందామని చిరంజీవి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సానుభూతి వల్ల జగన్ పార్టీ గెలిచిందని చెబుతుండగా చిరంజీవి మాత్రం సానుభూతితో పాటు పార్టీలో సమన్వయం లేకపోవడం కూడా కారణమని చెబుతున్నారు. ఇదే ప్రధానంగా చిరు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.