టాటాపై న్యాయపోరులో ఓటమి

 టాటాపై న్యాయపోరులో ఓటమి

సింగూరు భూముల విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టాటా మోటార్స్ సంస్థకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రభుత్వం తెచ్చిన భూ పునరావాస, అభివృద్ధి చట్టాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది. టాటా మోటార్స్ సంస్థకు భూకేటాయింపులను హైకోర్టు సమర్థించింది.

నిరుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మమతా బెనర్జీ ఈ చట్టాన్ని రూపొందించారు. సింగూరులో బుద్ధదేవ్ భట్టాచార్య టాటా మోటార్స్ సంస్థకు భూమి కేటాయించడాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. టాటా మోటార్స్ సంస్థకు వ్యతిరేకంగా ఆమె పెద్ద యెత్తున ఉద్యమం చేపట్టారు.

మమతా బెనర్జీ తెచ్చిన చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమంటూ టాటా మోటార్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, టాటా మోటార్స్ వాదనను హైకోర్టు సింగిల్ జడ్జి తోసిపుచ్చారు. సింగూరు భూ చట్టం రాజ్యాంగబద్ధమేనని తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును టాటా మోటార్స్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది.

తీర్పు అమలుపై రెండు నెలల పాటు హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. తన తీర్పుపై పై కోర్టుకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తూ డివిజన్ బెంచ్ ఆ స్టే విధించింది. సెప్టెంబర్ 28వ తేదీ వరకు తీర్పు అమలుపై స్టే విధించింది. టాటా మోటార్స్ సంస్థకు గత ప్రభుత్వం సింగూరులో 997 ఎకరాల భూమిని కేటాయించింది. నానో కారు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఆ భూమిని కేటాయించింది. భూమిని ఇవ్వడానికి ఇష్టం లేని రైతులకు చెందిన 400 ఎకరాల భూమిని తిరిగి ఇవ్వాలని మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేశారు.

టాటా మోటార్స్ 2008లో నానో కారు ప్రాజెక్టును గుజరాత్‌లోని సనంద్ ప్రాంతానికి తరలించింది. అయితే, సింగూరు భూములను మాత్రం తన స్వాధీనంలోనే ఉంచుకుంది.