ఆర్థిక మంత్రిగా ప్రణబ్ రాజీనామా

ఆర్థిక మంత్రిగా ప్రణబ్ రాజీనామా

యుపిఎ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగుతున్న  ప్రణబ్ ముఖర్జీ మంగళవారం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రిగా చివరిసారి మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. నా తప్పులను, ఒప్పులను హైలెట్ చేసిన మీడియాకు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. తన 40 ఏల్ల రాజకీయ ప్రస్థానం నేటితో ముగిసిందని ఆయన చెప్పారు. కొత్త ప్రయాణానికి తాను సిద్ధపడ్డానని అన్నారు. రాష్ట్రపతి పదవికి తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మీడియా ప్రతినిధులు తనను ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నారని తనకు తెలుసునని, అయితే నేడు కొత్త సంభాషణ ప్రారంభించే రోజు కాదని, ఇన్నేళ్లు మీడియా ప్రతినిధులతో తాను సంభాషించడం ఎంతగా బాగా ఉండేదో తనను చెప్చనీయాలని ఆయన అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను సమర్థించి గౌరవించిన ప్రస్తుత తరుణంలో రాజకీయ జీవితాన్ని వదిలేయడం పట్ల కాస్తా సెంటిమెంట్‌గా ఫీలవుతున్నానని ఆయన అన్నారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖలో తన సహచరులను తాను మిస్సవుతున్నట్లు ఆయన తెలిపారు. తన జీవితంలో ఇప్పటి వరకు ఇంత దూరం ప్రయాణించానని, అయితే తాను బెంగాల్‌లోని ఓ గ్రామంలో పుట్టాననే విషయాన్ని మరిచిపోనని, తాను పేద రైతుల జీవితాలను చూశానని ఆయన అన్నారు. తాను తీసుకున్న ప్రతి నిర్ణయం సరైందని చెప్పలేనని, అయితే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకున్నానని, నిర్ణయం తీసుకునే ముందు తన కళ్లెదుట ప్రజలు కనిపించేవారని ఆయన అన్నారు.

చాలా సార్లు విమర్శలతో, కొన్నిసార్లు ప్రశంసలతో మీడియా ప్రతినిధులు ఎల్లవేళలా తన బాధ్యతలను గుర్తు చేస్తూ వచ్చారని, ప్రజా జీవితంలో ఉన్నంత వరకు అది కొనసాగుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలని ఆయన అన్నారు.