జగన్ పార్టీ నేత చెవిరెడ్డి అరెస్టు

జగన్ పార్టీ నేత చెవిరెడ్డి అరెస్టు

 వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినిపోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో వచ్చి పోలింగ్ బూత్ వద్ద హంగామా చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి శానససభా స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

తమ పార్టీ కార్యర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు జిల్లా ఉదయగిరి  శాసనసభ నియోజకవర్గం అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఆందోళన చేపట్టారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై చర్య తీసుకోకుండా తమ పార్టీ కార్యకర్తలనే పోలీసులు వేధిస్తున్నారని ఆయన ఆరోపిస్తూ ఉదయగిరి పోలీసు స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని మొండ్రాయి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కారణం లేకుండానే తమపై పోలీసులు దాడి చేశారని గ్రామప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన ఎస్సై క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భద్రతపై  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ అనుమానాలు వ్యక్తం చేశారు.

గతంలో కేంద్ర బలగాలను ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారని, ఈసారి అలా లేదని, కొన్ని కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు లేవని ఆమె అన్నారు. గీసుకొండ మండలం వంతెనగిరి గ్రామంలో ఆమె మంగళవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు మొత్తం మీద సంతృప్తికరంగానే ఉన్నాయని ఆమె అన్నారు.