యూపీఏకు రాంరాం చెప్పేయోచనలో దీదీ

యూపీఏకు రాంరాం చెప్పేయోచనలో దీదీ

యూపీఏ నుంచి మమత బయటకు వస్తే ఏమవుతుంది.. మన్మోహన్ సర్కారుకు ముప్పుందా.. మధ్యంతర ఎన్నికలు వస్తాయా.. అసలు మమత వ్యూహం ఏంటి.. పదేపదే కాంగ్రెస్ ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. దీదీని ఎదుర్కొనేందుకు సోనియాకున్న అస్త్రాలేంటి..వాచ్ దిస్ స్టోరీ.

రాష్ట్రపతి అభ్యర్ధి ఎన్నిక యూపీఏకు- మమతకు మధ్య చిచ్చుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ప్రణభ్ ముఖర్జీ పేరును ఒప్పుకునే ప్రసక్తిలేదని దీదీ తేల్చిచెప్పడంతో సమస్య మొదలైంది. తాను సూచించిన వారినే బరిలో నిలపాలని  ముందు నుంచి బెట్టు చేస్తున్నారు మమత. కలాం, మన్మోహన్, సోమ్ నాథ్ ఛటర్జీల పేర్లను ప్రతిపాదించారు. ఈ విషయంలో ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ కూడా దీదీకి అండగా నిలిచారు. ఐతే..సోనియాతో భేటీ తర్వాత పరిస్థితి అంతా రివర్సయింది.  ప్రణబ్ కే ములాయం జై కొట్టడంతో మమత ఖంగుతిన్నారు. తన మాట చెల్లుబాటు కాలేదన్న అక్కసుతో యూపీఏ నుంచి వైదొలిగేందుకు కూడా మమత సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. 

ఐతే..మమత యూపీఏకు రాంరాం చెప్పినా మన్మోహన్ సర్కారుకు వచ్చే ముప్పేమీ లేదు. ఇప్పటికే మమత బెదిరింపులతో విసిగి వేసారిన యుపిఏ సర్కార్‌కు భరోసా లభించింది. టిఎంసి దూరమైనా యుపిఏకు మద్దతిస్తామని సమాజ్‌వాదీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రభుత్వంలో చేరతామన్న వాదనను మాత్రం ఆయన ఖండించారు. యుపి ఎన్నికల నేపథ్యంలో అప్పట్లో  పరస్పరం కారాలు మిరియాలు నూరుకున్న ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలిపుడు దోస్త్‌ మేరా దోస్త్‌ అనుకుంటున్నాయి. యుపిఏలో కాంగ్రెస్‌ పార్టీ తర్వాత అత్యధిక సీట్లున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ దూరమైనా ఎస్పీ అండతో ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏదీ లేదు. నెంబర్‌ గేమ్‌లో తృణమూల్‌కున్న 19 సీట్లతో పోలిస్తే సమాజ్‌వాదీకున్న 22 సీట్లే యుపిఏకు కీలకం. పైగా సంఖ్యా బలం మూడు సీట్లు అదనం.

అటు బీఎస్పీ, ఆరెల్డీ కూడా యూపీఏకు అండగా ఉన్నాయి. దీంతో మమత బయటకు వెళ్లినా వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఆమెకే నష్టం తప్ప తమకొచ్చిన నష్టమేదీ లేదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఐతే.. బెంగాల్ లో సంకీర్ణ సర్కారులో భాగస్వామైన కాంగ్రెస్ .. ఆ సాహసాన్ని చేస్తుందా అనేది డౌటే. ఇప్పటికే అక్కడ ఉప్పు-నిప్పుగా ఉన్న ఇరు పార్టీలు తాజా పరిణామాలతో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అటు దీదీ కేంద్రంలో మద్దతు ఉపసంహరించుకున్నా ఇప్పటికిప్పుడు మధ్యంతరం వచ్చే ఛాన్సే లేదు. దీంతో మమత ప్రభావం పెద్దగా ఉండదని కాంగ్రెస్ భావిస్తోంది. స్పెషల్‌ ప్యాకేజీ కోసమే మమత ఇలాంటి పొలిటికల్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నారని ఆమె గురించి తెలిసిన వారు బహాటంగానే అనుకుంటున్నారు.