పవన్‌పై సల్మాన్ ఖాన్ నమ్మకం!

పవన్‌పై సల్మాన్ ఖాన్ నమ్మకం!

దక్షిణాదిన హిట్టయిన సినిమాలను రీమేక్ చేస్తూ హిట్లమీద హిట్లు కొడుతున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర టాప్ హీరోలు నటిస్తున్న సినిమాలపై ఓ కన్నేసి ఉంచాడు. ఇప్పటి వరకు హిట్టయిన తర్వాతనే రీమేక్ నిర్ణయానికి వచ్చే సల్మాన్ ఈ సారి పవన్ కళ్యాణ్‌‌పై నమ్మకంతో సినిమా విడుదలకు ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రూపొందుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ కావడం, పవన్ కళ్యాణ్ చాలా ఇష్టపడి చేస్తున్న స్క్రిప్టు కావడంతో.......ఇప్పటి నుంచే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకునే ప్రయత్నం చేస్తోందట సల్మాన్ టీం.

‘గబ్బర్ సింగ్' లాంటి  బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమా కావడంతో...తప్పకుండా ఆ సినిమాను మించిన అంచనాలతోనే పవన్ కళ్యాణ్ ఆ చిత్రానికి ఒకే చెప్పాడని సల్మాన్ భావిస్తున్నాడట. అందుకే పవర్ స్టార్ నిర్ణయంపై పూర్తి నమ్మకంతో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' హిందీ రీమేక్ హక్కులను దక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈచిత్రంలో పవన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తుండగా, తమన్నా ‘గంగ' పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూర్చుతున్నాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని పవన్ అభిమానులు కోరుకునే అన్ని ఎంటర్‌టైన్మెంట్స్ ఎలిమెంట్స్ కలగలిపి రూపొందిస్తున్నారు. ముఖ్యంగా పవన్ మేనరిజానికి తగిన విధంగా ఆయన రాసిన డైలాగులు కేకపుట్టించే విధంగా ఉండనున్నాయి.